Telugu Gateway
Andhra Pradesh

కొల్లు శాఖ ‘లోకేష్ హైజాక్’!

కొల్లు శాఖ ‘లోకేష్ హైజాక్’!
X

ఏపీలో ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లే. ఇది ప్రచారమే కాదు..వాస్తవం కూడా. ఏ కీలక నిర్ణయం అయినా వాళ్లిద్దరే తీసుకుంటారు. వాళ్ళు అనుకున్నట్లు కేబినెట్ లో పెడతారు. అందరి ఆమోదం అయిపోతుంది. గత ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు నెలకు రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ నాలుగేళ్లు గడిచిపోయాయి. గురువారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండు వేలను కాస్తా వెయ్యి రూపాయలకు తగ్గించారు. అయినా అది మొదలుపెట్టడానికి ఇంకా ఎన్ని నెలలు పడుతుందో క్లారిటీ లేదు. నిర్ణయం అయితే తీసుకున్నారు. నిరుద్యోగ భృతి అమలు చేయటం లేదని...ఇఛ్చిన హామీని విస్మరించారని విమర్శలు వచ్చినప్పుడల్లా ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వివరణలు ఇచ్చేవారు. దాని కోసం ఆయన నానా తంటాలు పడేవారు. ఎందుకంటే ఏపీలో న్యాయ, నైపుణ్యాభివృద్ధి, యువజన, క్రీడలు, నిరుద్యోగ భృతి, ఎన్ ఆర్ఐ సాధికారికత వంటి శాఖలు ఆయన పరిధిలోనే ఉన్నాయి.

సహజంగా మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి..ఏదైనా ఇతర శాఖలకు సంబంధించిన కీలక అంశాలు ఉంటే ఆయా శాఖల మంత్రులు మీడియాకు వివరిస్తారు. కానీ నిరుద్యోగ భృతికి సంబంధించిన కీలకమైన అంశాన్ని గతంలో ఎప్పుడూ కేబినెట్ వివరాలు వెల్లడించిన దాఖలాలు లేని మంత్రి నారా లోకేష్ సీన్ లోకి వచ్చారు. ఆయనే మీడియాకు వివరించారు నిరుద్యోగ భృతి అంశాన్ని. అంటే కొల్లు రవీంద్ర సబ్జెక్ట్ ను లోకేష్ హైజాక్ చేశారన్న మాట. నాలుగేళ్ల జాప్యం తర్వాత అయినా వచ్చే క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన తెరపైకి వచ్చారు. వివరణలు..కొల్లు రవీంద్ర వంతు..క్రెడిట్ నారా లోకేష్ ఖాతాకు. యువరాజావారు సీన్ లోకి వస్తే ఊరికే ఉంటుందా?. ఓ ఛానల్ అయితే చాలా ఉత్సాహంగా నిరుద్యోగ యువతకు యువనేత కానుక నెలకు 1000 భృతి అంటూ ఊదరకొట్టేసింది. వాళ్ళు కోరుకున్నదే ఆ ఛానల్ చేసింది.

Next Story
Share it