Telugu Gateway
Andhra Pradesh

లోకేష్...ప్లీజ్ మీ నాన్నకు వాచీ..ఉంగరం కొనిపెట్టు

లోకేష్...ప్లీజ్ మీ నాన్నకు వాచీ..ఉంగరం కొనిపెట్టు
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇంత శక్తి ఉందని ఎవరికీ తెలియదు. ఆయన తన ‘మాటల’తోనే ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారు. చాలా మంది ఆయన మాటలు చూసి షాక్ కు గురవటంతోపాటు..బీపీలు పెంచుకుని ఆస్పత్రి పాలు కూడా కావాల్సి వస్తోంది. ఓ వైపు ఏపీలో పలు ప్రాజెక్టుల్లో వందల కోట్ల అక్రమాలు..కుంభకోణాలు జరుగుతున్నాయి. వీటికి సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే తన అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలోనే పెట్టి మరీ ఓకే చేయించేస్తున్నారు. మరో వైపు చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కు ఏటా హెరిటేజ్ నుంచి వంద కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రకటిస్తారు. అసలు తనకు రాజకీయాలు ఎందుకు?. సేవ చేయటానికి వచ్చారు అని చెబుతారు. అంత వరకూ ఓకే. కానీ ఈ మధ్య కాలంలో చంద్రబాబు పదే పదే చెబుతున్న మాటలు చూసి ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు. ప్రజలకు బీపీలు పెంచే అంశాలు ఇవే. ‘‘ నా చేతికి వాచీ లేదు. వేలికి ఉంగరం లేదు. జేబులో రూపాయి లేదు. నేను నిప్పు.’ ఆ మాటలు వింటున్న ప్రతిసారి చాలా మందికీ బీపీలు హై రేంజ్ కు వెళ్లిపోయి..ఆస్పత్రుల పాలు అవుతున్నారు. ఏటా వంద కోట్ల రూపాయలు వచ్చే నారా లోకేష్ కనీసం చంద్రబాబుకు వాచీ కొనుక్కోవటానికి..ఉంగరం కొనుక్కోవటానికి కూడా డబ్బులు ఇవ్వటం లేదా?. లోకేష్ కు అంత స్వార్ధం ఉందా?.

పాపం చంద్రబాబు నిత్యం ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ..ఎక్కడికి పోయినా ఫైవ్ స్టార్ సౌకర్యాలకు కొదువలేకుండా విలాసాలు అనుభవించే ఆయన అంత కష్టాల్లో ఉంటే లోకేష్ ఆదుకోకపోవటం అనేది క్షమార్హం కాని అంశం. అంతే కాదు..ప్రధాని మోడీ మిత్రపక్షాలను ఏ మాత్రం పట్టించుకోరనే విమర్శ ఉంది. అంతే కాదు..సొంత మంత్రులను కూడా లెక్కచేయరు. మోనార్క్ లాగా వ్యవహరిస్తారు అనే విమర్శ ఉంది. ఎవరికైనా మేలు చేస్తే చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి..నేరుగా మోడీ మీద అవినీతి ఆరోఫణలు లేవు. కానీ ఆయన కూడా ఎప్పుడూ ధైర్యం చేసి ‘నేను నిప్పు’ అని చెప్పుకొనే ప్రయత్నం చేయలేదు. కానీ అదేమి విచిత్రమో కానీ దేశంలో ఏ సీఎం కూడా చెప్పని తరహాలో చంద్రబాబు మాత్రం నిత్యం నేను నిప్పు అనే పదే పదే చెప్పి..ఆ నిప్పు వేడితో పాటు...పలు మాటల దాడితో ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నారు. మరి టీవీల్లో చంద్రబాబు మాటలను చూసే వారిని ఎవరు కాపాడతారో..ఆ దేవుడే చూసుకోవాలి.

Next Story
Share it