బిజెపికి 150 సీట్లు మించవు
బిజెపిపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుపై విమర్శలు గుప్పించారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అసహనం ఎందుకు ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. ఏపీలో అభివృద్ధి కాగితాలకే పరిమితం అయిందా..నిజంగా జరిగిందా అనే అంశం నరసింహరావు గ్రామాల్లో పర్యటిస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలలో లోక్ సభలో భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీగా మాత్రమే ఉంటుందని కుటుంబరావు అభిప్రాయపడ్డారు.
బిజెపికి కేవలం 150 సీట్లు మాత్రమే వస్తాయని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రభుత్వ అధికారులపై నమ్మకం లేనట్లుగా ఉందన్నారు. స్టాక్ మార్కెట్‌లో పనిచేసిన వ్యక్తులు అడ్మినిస్టేషన్‌లో ఉండకూడదా? అని కుటుంబరావు ప్రశ్నించారు. ఏ రంగంలో అయినా నిపుణులను ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకోవటం చాలా చోట్ల ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం మానుకోవాలని జీవీఎల్ కు సూచించారు.