చంద్రబాబు..కెసీఆర్ ను చిక్కుల్లో పడేసిన కుమారస్వామి
ఒక్క దెబ్బకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ చిక్కుల్లో పడ్డారు. అది ఎవరూ ఊహించని రీతిలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామి రూపంలో వచ్చింది. కుమారస్వామి ప్రకటన ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్ద చిక్కునే తెచ్చిపెట్టేలా ఉంది. తెలంగాణలో కెసీఆర్ కు ప్రధాన రాజకీయ శత్రువు కాంగ్రెస్ పార్టీనే. అలాంటిది కర్ణాటక ఎన్నికల తర్వాత తనను కెసీఆర్ కూడా కాంగ్రెస్ తో కలసి వెళ్లాలని సూచించారని కుమారస్వామి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తే సీఎం కెసీఆర్ గత కొంత కాలంగా ప్రదాని మోడీ లైన్ లో ఉన్నట్లు కన్పిస్తోంది. పలు అంశాలు ఈ విషయాన్ని ధృవపర్చాయి కూడా. అకస్మాత్తుగా ఇప్పుడు కుమారస్వామి ఓ పత్రికకు ఇఛ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పటం రాజకీయంగా కలకలం రేపుతోంది. కెసీఆర్ ను కూడా కుమారస్వామి ప్రకటన చిక్కుల్లో పడేశాలా ఉంది. అయితే దీనిపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.
ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఏపీలో రాజకీయంగా ఆయన ఒంటరి అయ్యారు. కాంగ్రెస్ తప్ప ఆయనకు కలిసొచ్చే పార్టీ ఏదీ కన్పించటం లేదు. దీనికి తోడు తాజాగా కుమారస్వామి వ్యాఖ్యలు చంద్రబాబు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారనే విషయాన్ని బహిర్గతం చేసింది. చంద్రబాబు కూడా కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకోవాలని సూచించారని కుమారస్వామి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రాలోనూ కాంగ్రెస్ తో కలసి వెళ్లే అవకాశం ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో వచ్చిన వార్త చంద్రబాబును కూడా చిక్కుల్లో పడేసింది. టీడీపీ శ్రేణులకు కూడా ఈ విషయం ఏ మాత్రం మింగుడుపడటం లేదు. అందుకే ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తి వంటి సీనియుర్ నేత కాంగ్రెస్ తో పొత్తు ఉంటే ఉరి వేసుకుంటానని ప్రకటించి సంచలనం రేపారు.
రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని హామీ ఇచ్చారని చెబుతూ...ఆ హామీ సాకుగా చూపి కాంగ్రెస్ తో జట్టుకట్టడం ద్వారా బిజెపి, జనసేనలు దూరం కావటం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలనేది చంద్రబాబు ప్లాన్ గా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు రాజకీయంగా ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే. ఎందుకంటే ఎన్టీఆర్ పార్టీని పెట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకతపై. అయితే చంద్రబాబుకు అలాంటివి ఏమీ పట్టవు. ఆయనకు రాజకీయం అవసరం..గెలుపు అవసరం అంతే. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మద్దతు అడిగిన చంద్రబాబు..ఇప్పుడు పవన్ కు ఓట్లు ఎక్కడ ఉన్నాయ్ అనటం లేదా?. ఇదీ అంతే.