Telugu Gateway
Andhra Pradesh

‘చిక్కుల్లో చంద్రబాబు’!

‘చిక్కుల్లో చంద్రబాబు’!
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిక్కుల్లో పడ్డారా?. సొంత పార్టీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్క టీడీపీలోనే కాకుండా..రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతున్నాయి. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోడీ ఓ వర్గం వారిని హత్య చేయించారని..ఆయన ప్రధాని పదవికి అర్హుడు కాడని టీడీపీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కూడా మోడీ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకునేటప్పుడు కూడా టీడీపీ ఈ విషయంపై ప్రజలకు క్షమాపణ కూడా ఏమీ చెప్పలేదు. ఇఫ్పుడు ఏకంగా సొంత పార్టీ ఎంపీ దివాకర్ రెడ్డి ఏకంగా మోడీపై హత్య ఆరోపణలు చేశారు. మరి అలాంటి మోడీ ప్రధానిగా ఉన్న ప్రభుత్వంలో మూడున్నర సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఎలా కొనసాగింది. మంత్రి పదవులు ఎలా తీసుకుంది. అప్పుడు ఆ హత్యలు కన్పించలేదా?. ఇప్పుడు మాత్రమే కన్పిస్తున్నాయా?. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన జె సీ ఖచ్చితంగా చంద్రబాబును చిక్కుల్లో పడేసినట్లు అయిందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఎన్నికల కోసం ఓ వైపు మైనారిటీలను దువ్వుతున్న చంద్రబాబును జెసీ వ్యాఖ్యలు పూర్తి ఇరకాటంలోకి నెట్టాయి. ఇప్పడు చంద్రబాబు జెసీ వ్యాఖ్యలను ఖండిస్తారా?. లేక వాటిని సమర్థిస్తారా?. ఏది చేసినా అది చంద్రబాబు చిక్కుల్లో పడేయటం ఖాయంగా కన్పిస్తోంది. ఒక్క మోడీ విషయంలోనే కాదు..సీఎం రమేష్ దీక్షపైన కూడా ఎంపీ జెసీ వ్యాఖ్యలు టీడీపీ నేతలను విస్మయానికి గురిచేశాయి. రమేష్ దీక్ష వల్ల ఉక్కు పరిశ్రమ కాదు కదా..కనీసం తుక్కు పరిశ్రమ కూడా రాదని తేల్చిపారేశారు. అంతే కాదు..'చంద్రబాబు ఏం తక్కువవాడు కాదని.. నాటకాలడటం, డ్రామాలు ఆడించడం, మాటలు చెప్పడం, కుయుక్తులు పన్నడం అన్నీ తెలుసు" అని వ్యాఖ్యానించి కలకలం రేపారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండటం ఏపీ ప్రజల ఖర్మ అని, రాష్ట్రానికి ప్రధాని ఏమీ చేయరని విమర్శించారు.

Next Story
Share it