Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుపై గంటా తిరుగుబాటు?..కేబినెట్ కు డుమ్మా!

చంద్రబాబుపై గంటా తిరుగుబాటు?..కేబినెట్ కు డుమ్మా!
X

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తిరుగుబాటు చేస్తున్నారా?. అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. పలు అంశాల్లో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఆయన సన్నిహితులు సైతం అంగీకరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఓ పత్రిక సర్వేలో భీమిలీలో గంటాపై తీవ్ర అసంతృప్తి ఉందని..ఆయన గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అయితే దీని వెనక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హస్తం ఉండి ఉంటుందని ఆయన సన్నిహితులు అనుమానిస్తున్నారు. కావాలనే రాజకీయంగా తనను దెబ్బకొట్టేందుకే చంద్రబాబు ఇలాంటి ప్లాంటింగ్ స్టోరీలు ప్లాన్ చేస్తున్నారనే అనుమానంతో గంటా ఉన్నారు. ఇదే కారణంతో ఆయన మంగళవారం నాడు అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరుకాలేదు. కేబినెట్ కు డుమ్మా కొట్టేంత సీరియస్ పనులేమీ లేవని..ఆయన లీకు సర్వేల కారణంతోనే మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేదని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.

గంటా తాను మంత్రివర్గ సమావేశానికి రావటం లేదనే సమాచారం కూడా ఇఛ్చినట్లు లేదని చెబుతున్నారు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పరిస్థితి తాజా పరిణామాలతో ఎటువైపు మరలుతుందో వేచిచూడాల్సిందే. విద్యా శాఖలో జరుగుతున్న పలు ప్రాజెక్టుల విషయంలో కూడా సీఎం, మంత్రి మధ్య విభేదాలు తలెత్తినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు మంత్రివర్గంలో ఒక్క గంటానే కాదు..ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తితోపాటు పలువురు సీనియర్లు కూడా గుర్రుగానే ఉన్నారు. కానీ చాలా మంది పరిస్థితులు అనుకూలించక మౌనంగా ముందుకు సాగుతున్నారు. గంటా విషయానికి వస్తే ఆర్థికంగా..సామాజికంగా బలమైన వ్యక్తి కావటంతో ఆయన చంద్రబాబుపై తిరుగుబాటుకు జెండా ఎగరేశారని అంటున్నారు. గంటాతోపాటు మంత్రి నారాయణ కూడా పరిస్థితులను బట్టి పవన్ కళ్యాణ్ వైపు కూడా వెళ్లొచ్చని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది.

Next Story
Share it