Telugu Gateway
Andhra Pradesh

‘ట్రంప్...కిమ్’ నూ వాడేసిన చంద్రబాబు

‘ట్రంప్...కిమ్’ నూ వాడేసిన చంద్రబాబు
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘వాడకం’ మొదలుపెడితే ఎవరైనా సరే అవాక్కు అవ్వాల్సిందే. సంబంధం లేకపోయినా దేని నుంచి దేనికైనా ‘లింక్’ పెట్టడంలో బహుశా చంద్రబాబుకు ఉన్నంత నైపుణ్యం సినీ పరిశ్రమలోని దిగ్గజాలకు కూడా ఉండి ఉండదనే చెప్పొచ్చు. మంగళవారం నాడు ప్రపంచం అంతా సింగపూర్ వైపే చూసింది. దీనికి కారణం ఇద్దరు తుంటరి నేతలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ల భేటీనే కారణం. మరి ఇందులో అసలు చంద్రబాబు పాత్ర ఏమి ఉంది అంటారా?. ఎందుకు లేదు. చాలా ఉంది. మంగళవారం నాడు విజయవాడలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సింగపూర్ లో ట్రంప్-కిమ్ భేటీ కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ భేటీకి టీడీపీ నేతలకు సంబంధం ఏమిటని అనుకుంటున్నారా?. అదే అసలు కథ. ‘ట్రంప్, కిమ్ లు తమ భేటీకి సింగపూర్ ను ఎంచుకున్నారు. ఇద్దరు ఆగ్రనేతలకు అతిధ్యం ఇస్తుందంటే సింగపూర్ గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. ట్రంప్, కిమ్ కు సింగపూర్ పై నమ్మకం ఉంటే, సింగపూర్ కు ఏపీపై చాలా నమ్మకం ఉంది.

సింగపూర్ కంపెనీలు ఏపీలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేయటానికి వస్తే వాటిపై విమర్శలు చేస్తారా?’ ఇవీ చంద్రబాబునాయుడి వ్యాఖ్యలు. అంటే ఈ లెక్కన గొప్ప దేశం అయిన సింగపూర్ సంస్థలు చంద్రబాబుతో కలసి చేసే ఏ దోపిడీని ఎవరూ ప్రశ్నించకూడదన్న మాట. ఇదీ చంద్రబాబు అంతరంగం. అసలు కిమ్, ట్రంప్ మీటింగ్ కూ..అమరావతిలో సింగపూర్ సంస్థలు చేసే వ్యాపారంలో గొప్పతనం ఏంటో చంద్రబాబుకే తెలియాలి. ఏపీ ప్రభుత్వం, సింగపూర్ సంస్థలతో కలసి చేసుకున్న ఒప్పందం ఏపీ చరిత్రలో ‘అతి పెద్ద కుంభకోణం’గా మారనుందనే విమర్శలు ఓ వైపు ఉంటే..చంద్రబాబు మాత్రం కిమ్, ట్రంప్ మీటింగ్ కు సింగపూర్ వేదిక అయింది కాబట్టి..ఇంక నన్ను ఎవరూ తప్పుపట్టకూడదు అన్న చందంగా వ్యాఖ్యానించటంతో అవాక్కు అవటం మీటింగ్ లో ఉన్న టీడీపీ నేతల వంతు అయింది. ఇంకా నయం..సింగపూర్ లో మీటింగ్ పెట్టుకోమని ట్రంప్, కిమ్ కు నేనే సూచించాను అని చెప్పకుండా వదిలేశారు..సంతోషం.

Next Story
Share it