అసలు చంద్రబాబుకు ఏమైంది?
ఇదీ సోమవారం నాడు నాయీ బ్రాహ్మణులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరు చూసిన తర్వాత ఐఏఎస్ అధికారులతో పాటు టీడీపీ నాయకుల్లో వ్యక్తం అవుతున్న అనుమానం. అక్కడ ఉన్న విలేకరుల సైతం చంద్రబాబు తీరును చూసి విస్తుపోయారు. ఇదెక్కడి తీరు..ఓ ముఖ్యమంత్రి సచివాలయం రోడ్డుపై ఇలా మాట్లాడటం ఏంటి? అంటూ అవాక్కు అయ్యారు. అసలు నాయీ బ్రాహ్మణులతో తాను తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా?. అది ఏమైనా సందర్భమా?. తమ సమస్య చెప్పుకోవటానికి వచ్చిన వారిని బెదిరిస్తూ...హెచ్చరికలు జారీ చేస్తూ...తోకలు కట్ చేస్తానంటూ సీఎం బహిరంగంగా వ్యాఖ్యానించటం ఏపీలో కలకలం రేపుతోంది. ఎక్కడ పనిచేసే వారికి అయినా కనీస వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.ఏవైనా ప్రైవేట్ సంస్థలు/వ్యక్తులు కనీస వేతనం ఇవ్వకపోయినా ఇప్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. కానీ సాక్ష్యాత్తూ విజయవాడలోని కనకదుర్గ గుడిలో పనిచేసే క్షురకులకు కనీస వేతనం ఇవ్వటం కుదరదు పోండి అని మీడియా ముందు..బహిరంగంగా సీఎం వ్యాఖ్యానించటం చూసి అధికారులు అవాక్కు అవుతున్నారు.
ప్రస్తుతం ఉన్న 13 రూపాయలను 25 రూపాయలు చేస్తాను తప్ప..కనీస వేతనం ఇవ్వం అని తేల్చేశారు. అయినా అసలు సీఎం రోడ్డు మీద అలా ఆగిమాట్లాడటమే తప్పు అని..ఓ నలుగురైదురు బృందాన్ని కార్యాలయానికి రమ్మని వెళ్లిపోయి ఉండాల్సింది అని..అక్కడ ఉన్న అధికారులు కూడా ఏమి చేస్తున్నారో తెలియకుండా ఉందని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబు తీరుతో మొత్తం పరువు పోయినట్లు అయిందని చెబుతున్నారు. ఓ వైపు సింగపూర్ సంస్థలకు వేల కోట్లు దోచిపెడుతూ..విమానాలు నడిపే వారి నష్టాలు భరించటానికి ముందుకు వచ్చే సర్కారు..బహిరంగంగా అదీ ఓ ముఖ్యమంత్రి కనీస వేతనాలు ఇవ్వం అని చెప్పటం అంటే కార్మిక శాఖ నిబంధనలను ఉల్లంఘించటమే అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఓ వైపు ఏపీలో దోపీడీ అడ్డగోలుగా సాగుతుంటే అవేమీ పట్టించుకుని సీఎం...కష్టపడి పనిచేసే వారికి కనీస వేతనాలు కూడా ఇవ్వం..ఎక్కువ మాట్లాడితే మీ సంగతి చూస్తా?. తేలుస్తా అని నాయీ బ్రాహ్మణులతో వ్యాఖ్యానించటంతో అసలు చంద్రబాబు కు ఏమైంది? అన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది.