చంద్రబాబే సీఎం.. సీబీఐ.. కాగ్ కూడా
చంద్రబాబు. ఒక్క ముఖ్యమంత్రే కాదు. ఆయనే సీబీఐ...కాగ్. జడ్జిలాగా తీర్పులు కూడా ఇచ్చేస్తారు. అంతా క్లియర్. అన్నీ ఓకే. అసలు ఇక్కడ తప్పులే లేవు. పరిపాలన అంతా సవ్యంగా..సక్రమంగా..దేశంలో ఎక్కడా లేనంత పారదర్శకంగా జరుగుతోంది. అయినా విమర్శలా?. నో ఛాన్స్ అంటున్నారు చంద్రబాబు. చంద్రబాబు తాజా వ్యాఖ్యలు చూడండి. ‘ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో అవినీతిని నియంత్రించాం. గత నాలుగేళ్ళలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదు.’ అని తేల్చిపారేశారు. అంతే. ఇక ఎవరూ ఏమి మాట్లాడటానికి వీల్లేదు. కుంభకోణాలు లేవని చంద్రబాబు చెప్పేశాక..ఇక కుంభకోణాలు..అవినీతి ఎక్కడ ఉంది. ఎందుకు ఉంటుంది?. ఎక్కడ ఉంటుంది?. ఆయన తేల్చేస్తే తేలిపోయినట్లే లెక్క. చంద్రబాబు నిప్పు అంటే..నిప్పు. కుంభకోణం లేదంటే కుంభకోణం లేదు?. అదేంటో మరి సీఎంఎస్ సంస్థ సర్వేలో మాత్రం ఏపీ అవినీతిలో దేశంలోనే నాల్గవ స్థానంలో ఉందని తేల్చింది. నీరు చెట్టులో అసలు అవినీతే లేదు. ఇసుక ఏపీ ప్రజలందరికీ ‘కావాల్సినంత’ ఉచితంగా దొరుకుతోంది. పోలవరంలో అక్రమాలు లేవు. పట్టిసీమలో కుంభకోణాలు లేవు. సాగునీటి శాఖలో అంచనాల పెంపు అంతా సాఫీగానే సాగిపోతోంది. సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో కూడా అంతా సాఫీగానే సాగింది. కాగ్ ఏమి చెప్పినా చంద్రబాబు చెప్పిందే ఫైనల్. అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ)లో మెక్కల పేరుతో కోట్లు బొక్కినా అంతా క్లియరే.
సింగపూర్ కంపెనీలకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నా అదంతా చంద్రబాబు క్రెడిటే. ఆయన విశ్వసనీయత చూసి వచ్చి ఇప్పటికే రాజధాని పూర్తి చేసి వెళ్ళిపోయాయి సింగపూర్ కంపెనీలు. కేంద్రం ఇఛ్చిన నిధుల విషయంలో రాజధాని కట్టకుండానే కట్టినట్లు యూసీలు ఇచ్చినా ఏమీ మాట్లాడకూడదు?. ఫైబర్ గ్రిడ్ లో అసలే స్కామే జరగలేదు. ప్రభుత్వంలో ఉన్నతాధికారుల సిఫారసులను పక్కన పెట్టేసి..తనకు కావాల్సిన పనులన్నింటిని కేబినెట్ ముందు పెట్టేసి ఓకే చేయించుకున్న చంద్రబాబు అత్యంత నిజాయతీతో కూడిన పరిపాలకుడు. ఈ విషయం తేలిపోయింది. ఎవరు తేల్చారు అంటారా?. చంద్రబాబు చెపితే సరిపోదా?. ఏంటి?. ఆయన తేల్చేశారు కదా?. ఈ నాలుగేళ్ళలో అసలు కుంభకోణాలే లేవని?.