Telugu Gateway
Andhra Pradesh

ఎంపీలకు చంద్రబాబు క్లాస్

ఎంపీలకు చంద్రబాబు క్లాస్
X

ఒక్క దెబ్బకు పరువు పోయింది. ఎవరూ లేరు అనుకుని అన్నీ నిజాలే మాట్లాడారు. కానీ ఎవరో అది కాస్తా వీడియో తీయటం..సోషల్ మీడియాలో పెట్టడంతో రచ్చ రచ్చ అయింది. ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ ఎంపీలు ఎంత గొప్పగా పోరాటం చేస్తున్నారో ఆ వీడియోలో ఉండటంతో టీడీపీ అధిష్టానం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందుకే సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయమే ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి క్లాస్ తీసుకున్నారు. ఓ వైపు సీఎం రమేష్ ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తుంటే ఇలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. అయితే ఎంపీలు మాత్రం వీడియోను ఎడిట్ చేసి..కొన్ని అంశాలను మాత్రమే పెట్టారని ఆరోపిస్తున్నారు. ఎంపీ మురళీమోహన్, అవంతి శ్రీనివాస్‌ వ్యాఖ్యలను కట్ అండ్ పేస్ట్ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది.

ఆ వీడియో ఎవరు తీశారో.. ఎందుకు తీశారో విచారణ జరిపి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. 5 కోట్ల మంది ప్రజల హక్కులను కాలరాయోద్దంటూ ఆయన మీడియాకు హితవు పలికారు. అయితే ఎక్కడా కూడా ఎంపీలు మీడియాలో వచ్చిన మాటలు తాము అనలేదని చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే అంతా వీడియో రికార్డ్ అయి ఉంది కాబట్టే. ఎంపీల చర్యల వల్లే పార్టీ డ్యామేజ్‌ అవుతోందన్న చంద్రబాబు.. అందరూ ఒకే మాటపై ఉండాలని సూచించారు. కుట్రదారుల చేతిలో ఎంపీలు పావులుగా మారకూడదన్నారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలను కోరారు. ఎంతో కీలకమైన ఈ సమయంలో ఎవరూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయొద్దన్నారు.

Next Story
Share it