Telugu Gateway
Andhra Pradesh

‘ఇసుక’ దోపిడీని అంగీకరించిన చంద్రబాబు!

‘ఇసుక’ దోపిడీని అంగీకరించిన చంద్రబాబు!
X

అధికార పార్టీ ఎమ్మెల్యేల ‘ఇసుక దోపిడీ’ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరోక్షంగా అంగీకరించినట్లు అయింది. ఇసుక దోపిడీపై ఇష్టానుసారం మాట్లాడొద్దు..ఆధారాలు ఉంటే చూపండి.. రీచ్ ల దగ్గర మీరు మనుషులు పెట్టండి..నేను మద్దతు ఇస్తాను అంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..ఇప్పుడు ఎందుకు ప్లేట్ ఫిరాయించారు. అంతా సవ్వంగా ఉంటే ఇసుక రీచ్ లను ఇప్పుడు ‘వెలుగు’ కిందకు తీసుకురావాలని మంత్రివర్గంలో ఎందుకు నిర్ణయం తీసుకున్నట్లు. నాలుగేళ్ళ పాటు యధేచ్చగా సహజ వనరు అయిన ఇసుక దోపిడీకి తలుపులు బార్లా తెరిచి..ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉందనగా.. ఈ మార్పులు చేయటం వెనక ఉద్దేశం ఏమిటి?. నిజంగా వెలుగుకు అంత సీన్ ఉందా?. ఇసుక రీచ్ లను వెలుగు సిబ్బంది కంట్రోల్ చేయగలరా?. ఎమ్మెల్యేలను వెలుగు సిబ్బంది ఎదిరించగలరా?. అంటే ఏ మాత్రం సాధ్యం కాదనే అభిప్రాయం అధికార వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది.

ఎన్నికల ముందు తానేదో దిద్దుబాటు చర్యలు తీసుకున్నానని ప్రజలను నమ్మించటానికి తప్ప...దీని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు తెలియకుండా ఏ నియోజకవర్గంలో ఏమీ ముందుకు కదలని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ తరుణంలో వెలుగు సిబ్బంది అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఎదిరించి ఇసుక ఉచితంగా అందజేయగలరనుకోవటం అత్యాశే అవుతుందని టీడీపీ నేతలు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. నామమాత్రపు ఖర్చుతో రోజుకు లక్షలకు లక్షలు సంపాదించే వెసులుబాటు ఉన్న ఇసుక దోపిడీకి అలవాటు పడిన ఎమ్మెల్యేలు ఈ పని వదిలేయటం అనేది జరిగే వ్యవహారం చెబుతున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇసుక విధానంలో మార్పులు చేసి..ఇప్పటి వరకూ దోపిడీ కొనసాగినట్లు పరోక్షంగా అంగీకరించినట్లు అయింది. ఏపీలో ఉచిత ఇసుక ఎమ్మెల్యేలకు తప్ప..ప్రజలకు కాదనే ప్రచారం ఉంది.

Next Story
Share it