Telugu Gateway
Andhra Pradesh

రమేష్ దీక్ష చేస్తావా..లేపేద్దామా!

రమేష్ దీక్ష చేస్తావా..లేపేద్దామా!
X

వెనకబడిన జిల్లా అయిన కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ బిజెపి ప్రభుత్వంలోని మంత్రివర్గంలో కొనసాగినంత కాలం ఏ రోజూ కూడా అటు పార్లమెంట్ లో..ఇటు బయట ఈ ప్లాంట్ పై పెద్ద గా నోరువిప్పని అధికార టీడీపీ ఇప్పుడు మాత్రం పొలిటికల్ ‘షో’ బాగానే చేస్తోంది. అసలు కడప స్టీల్ కోసం ఎక్కడలేని పోరాటం చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తోంది. అధికారంలో ఉండి ప్రాజెక్టు సాధించుకోవటం మాకు చేతకాలేదు..ఎందుకంటే ప్రతిపక్షం సహకరించటం లేదు...లేదంటే మాతో కలసి రావటం లేదు కాబట్టి అని చెప్పుకున్న పార్టీ బహుశా దేశంలో తెలుగుదేశం తప్ప మరొకటి ఉండదు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష పెద్ద రాజకీయ డ్రామాను తలపిస్తోంది. సోమవారం నాడు ఈ దీక్షకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఉక్కు దీక్షలో ‘ఖాళీ కుర్చీల కొట్లాట’ అంటూ కొంత మంది వీడియోతో సహా ఓ పోస్టింగ్ పెట్టారు. ఎవరైనా ఒక్క రోజు పూర్తిగా అన్నం తినకపోతేనే పూర్తిగా నీరసించిపోతారు.

కానీ సీఎం రమేష్ మాత్రం 53 సంవత్సరాల వయస్సులోనూ ఏ మాత్రం గ్లామర్ తగ్గకుండా మూడు రోజుల పాటు నీట్ గా షేవింగ్ చేసుకుని..దీక్షలో కూర్చుని మీడియాకు ఇంటర్వూలు ఇచ్చారు. అదేమి విచిత్రమో కానీ...ఎవరైన దీక్ష చేస్తే హెల్త్ బులెటిన్ ను డాక్టర్లు విడుదల చేస్తారు. కానీ సీఎం రమేష్ హెల్త్ బులెటిన్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డాక్టర్ గా మారి విడుదల చేశారు. ఇదంతా ఒకెత్తు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షలో ఉన్న సీఎం రమేష్ తో ఫోన్లో మాట్లాడి దీక్ష కొనసాగిస్తారా? లేక ఆస్పత్రికి తరలించమంటారా? అని అడిగారంట. ఆరు రోజుల తర్వాత కూడా నీరసం తప్ప..ఏమీ లేదు..అయినా సరే దీక్ష కొనసాగిస్తామని చెప్పారంట. ఇదీ ఓ వార్త సారాంశం. అంటే ఎవరైనా దీక్ష చేసేవాళ్ల అనుమతి తీసుకుని ఆస్పత్రిలో చేర్పిస్తారా? లేక ఆరోగ్య పరిస్థితి ప్రకారం చేస్తారా?. చంద్రబాబు పాలనలో ప్రజలు ఇలాంటి వింతలు, విడ్డూరాలు..విచిత్రాలు ఇంకెన్ని చూడాలో?.

Next Story
Share it