Telugu Gateway
Andhra Pradesh

కోట్లు గుమ్మరించి..సర్కారుకు ‘చిల్లర’ తెస్తానంటున్నబాబు!

కోట్లు గుమ్మరించి..సర్కారుకు ‘చిల్లర’ తెస్తానంటున్నబాబు!
X

ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘దోపిడీ’ బిజినెస్ మోడల్. అటు అమరావతిలో స్విస్ ఛాలెంజ్ దోపిడీ అయినా..వైజాగ్ లో లూలూతో లాలూచీ దందా అయినా ఒకటే. విశాఖపట్నం నడిబొడ్డున ఉన్న 13 ఎకరాల స్థలాన్ని దుబాయ్ కు చెందిన లూలూ గ్రూప్ కు అప్పగించాలని ఇఫ్పటికే చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. రుషికొండలోని భూమి విలువే మార్కెట్ ధర పది కోట్ల రూపాయల వరకూ ఉంది. అంటే..నగరంలోని ఈ భూమి విలువ ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఎకరం 25 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. అంటే ఈ భూమి విలువే ఏకంగా 325 కోట్ల రూపాయలు. ఈ భూమిని కేవలం నామమాత్రపు ధరకు లీజుకు ఇచ్చింది సర్కారు. లూలూ గ్రూప్ ఈ భూమిని తనఖా పెట్టి తెచ్చిన డబ్బుతోనే ఇక్కడ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ హాల్స్, మీటింగ్ హాల్స్..స్టార్ హోటల్, రిటైల్ మాల్ నిర్మించనుంది. అంటే భూమికి దుబాయ్ కంపెనీ ఇప్పటికిప్పుడు చెల్లించాల్సింది ఏమీ లేదు. తర్వాత కూడా ఇచ్చేది కేవలం లీజు మాత్రమే. అంటే ప్రభుత్వ భూమి కంపెనీకిచ్చి ...ఆ భూమినే తనఖా పెట్టి డబ్బులు తెచ్చి నిర్మాణాలు చేపట్టేది ప్రైవేట్ దుబాయ్ కంపెనీ. అంటే చేతి నుంచి పెట్టుబడి పెట్టకుండానే వందల కోట్ల రూపాయల స్థలాన్ని దక్కించుకోవటంతోపాటు..భారీ ఎత్తున లాభాలు దండుకోనున్నది లూలూ గ్రూప్. ఈ తరహా బిజినెస్ మోడల్ ఎక్కడైనా ఉంటుందా? అంటే అది ఒక్క చంద్రబాబు దగ్గర మాత్రమే.

వందల కోట్ల రూపాయల విలువైన భూమిని దుబాయ్ కంపెనీ లూలూకి అప్పగించకుండా...అడ్డగోలుగా ప్రభుత్వంలో ఎస్పీవీలు ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు తన సర్కారుతోనే అదే పనిచేయించవచ్చు కదా?. అంటే...సర్కారు చేస్తే మన కమిషన్లు..వాటాలు రావు కదా?. అందుకే ఇష్టానుసారం దుబాయ్ కంపెనీ ‘సింగిల్ బిడ్డర్’గా నిలిచినా మరీ ఇచ్చేశారు ప్రాజెక్టు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలోనూ చంద్రబాబు హైదరాబాద్ లోనూ ఇలాగే ప్రభుత్వ, ప్రైవేట్, భాగస్వామ్య (పీపీపీ) ప్రాజెక్టుల పేరుతో భారీస్కామ్ లు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడే అదే మోడల్ ను ఏపీలో అమలు చేస్తున్నారు. నిజంగా ప్రతిపాదిత కన్వెన్షన్ సెంటర్..ఎగ్జిబిషన్ హాల్స్ వంటి విశాఖ శివార్లలో ఎక్కడైనా చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి జరిగేది..కాస్త ఉపయోగం కూడా ఉండేది. అయితే అది చంద్రబాబుకు అంత ఉపయోగంగా ఉండదు కదా?.అందుకే ఈ మోడల్ ను ఎంచుకున్నారు. వందల కోట్ల రూపాయల ప్రజల సంపదను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి సర్కారుకు మాత్రం ‘చిల్లర’ మిగుల్చుతున్నారు. కుంభకోణాల ద్వారా కోట్ల రూపాయలు నొక్కేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

Next Story
Share it