విమానాల్లోనూ ‘అడుక్కుంటున్నారు’!
రోడ్లపై అడుక్కోవటం చూశాం..రైళ్లలోనూ...అక్కడక్కడ బస్సుల్లోనూ అడుక్కోవటం చూస్తాం. ఇది అందరికీ ఎదురయ్యే సంఘటనలే. ఇందులో విశేషం ఏమీ లేదు. కానీ ఓ వ్యక్తి విమానంలోనూ ఓ ప్లాస్టిక్ పౌచ్ పట్టుకుని సహచర ప్రయాణికుల నుంచి డబ్బులు అడుక్కోవటం ప్రారంభించాడు. ఇది చూసిన ఓ వ్యక్తి అది కాస్తా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో జరిగింది. దోహ నుంచి ఇరాన్ కు చెందిన శిరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతున్న ఫ్లైట్ లో ఈ సంఘటన జరిగింది.
తొలుత కొంత మంది ఇది ఏదో ఆకతాయి పని..ఆట పట్టించేందుకే అలా చేస్తున్నారని అనుకున్నారు. కానీ ఆ వ్యక్తి సీరియస్ గా ప్రయాణికుల నుంచి డబ్బులు అడుగుతూనే ఉన్నాడు. కొంత మంది ప్రయాణికులకు అతనికి డబ్బు సాయం కూడా చేశారు. అయితే తనకు నిర్దేశించిన సీటులో కూర్చోవాల్సిందిగా కేబిన్ సిబ్బంది పదే పదే కోరినా సరే ఆ ప్రయాణికుడు తన ప్రయత్నాలను ఆపలేదు. అయితే తర్వాత తేలింది ఏమిటంటే విమానంలో ప్రయాణికుల నుంచి డబ్బులు అడుక్కున్న వ్యక్తి దేశ బహిష్కరణకు గురైన వ్యక్తిగా గుర్తించారు. తన దగ్గర డబ్బులు ఏమీ లేకపోవటంతో ఆయన ప్రయాణికులను డబ్బులు అడిగినట్లు గుర్తించారు.