చంద్రబాబు...లోకేష్ కు ముందు ఏపీలో రోడ్లు లేవా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు ప్రజలకు ఏమి చెప్పదలచుకున్నారు?. చంద్రబాబు, లోకేష్ ల కంటే ముందు ఏపీలో అసలు రోడ్లే లేవా?. మరి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు పాదయాత్ర చేసింది రోడ్లపై కాదా?. అప్పుడు ఆయన సొంతంగా రోడ్లు వేసుకుని తిరగలేదే?. ఇప్పుడు మాత్రమే ఏపీలో కొత్తగా రోడ్లు వచ్చాయా?. చంద్రబాబు, లోకేష్ లను విమర్శించే వారు కొత్తగా రోడ్లు వేసుకుని వాటిపై నడవాలా?. ప్రభుత్వ రోడ్ల మీద నడవకూడదా?. ప్రభుత్వ రోడ్ల మీద నడిస్తే చంద్రబాబు, లోకేష్ లను విమర్శించకూడదా?. నిజంగా ఏపీలో అంతకు ముందు రోడ్లు లేవు అంటే..దానికి చంద్రబాబునాయుడు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతకు ముందు ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా?. అంటే గతంలో తాను ఏమీ పనిచేయలేదని చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా?. ఇప్పుడు మాత్రమే పనిచేస్తున్నారా?. రోడ్లు వేయటం అయినా...మంచి నీటి సౌకర్యం కల్పించటం అయినా ప్రభుత్వాల బాధ్యత.
అయినా దీనికి తామేదో చాలా గొప్ప ఘనకార్యాలు చేసినట్లు...అంతకు ముందు అసలు ఏపీలో రోడ్లే లేనట్లు చంద్రబాబు, లోకేష్ లు మాట్లాడటంపై టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ఆశ్చర్యపోతున్నారు. రాజకీయాల్లో నలభై ఏళ్ళ అనుభవం ఉండి...పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన సొంతూరు నారావారిపల్లె, టీడీపీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ స్వగ్రామం అయిన నిమ్మకూరును కూడా ఆదర్శగ్రామాలుగా ఇఫ్పటికీ తీర్చిదిద్దలేకపోయారు. అందుకే నారావారిపల్లెను కోడలు బ్రాహ్మణీకి, నిమ్మకూరును కొడుకు లోకేష్ కు దత్తత ఇచ్చారు. జన్మభూమి పథకానికి ఆద్యుడుగా చెప్పుకునే చంద్రబాబుకు ఇది అవమానం కాదా?. లోకేష్ దత్తత పేరు చెప్పుకుని సర్కారు నిధులతో నిమ్మకూరులో పనులు చేయించుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతం అయిన విజయవాడలో సురక్షిత తాగునీరు ప్రజలకు అందుబాటులో లేదంటే చంద్రబాబు, లోకేష్ పాలన ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మంచినీళ్లు కూడా కొనుక్కొని తాగాల్సిందే. ఇదీ చంద్రబాబు, నారా లోకేష్ ల ‘డెవలప్ మెంట్’.