Telugu Gateway
Andhra Pradesh

మాజీ సీఎస్ లతో చంద్రబాబు రాయ‘బేరాలు’!

మాజీ సీఎస్ లతో చంద్రబాబు రాయ‘బేరాలు’!
X

తెలుగుదేశం పార్టీకి అటు రాజకీయంగా..ఇటు అధికారుల పరంగా ఉక్కపోత ఎదురవుతోంది. గత కొంత కాలంగా పార్టీకి గడ్డు కాలం ప్రారంభం అయినట్లే కన్పిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వారంతా చంద్రబాబు సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. ఇదీ చంద్రబాబును వ్యక్తిగతంగా..ప్రభుత్వ పరంగా తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. చంద్రబాబు సర్కారుపై తొలుత తీవ్ర విమర్శలు చేసిన ఐ వైఆర్ కృష్ణారావుపై అయితే టీడీపీ నేరుగానే విమర్శలు ఎక్కుపెట్టింది. ఆయన కూడా అదే స్థాయిలో ప్రభుత్వంలో ఉన్న లోపాలను ప్రశ్నించారు. అయితే ఐవైఆర్ తర్వాత పదవి విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి. ఆయనకు ప్రభుత్వ వర్గాలతోపాటు..ప్రజల్లో కూడా మంచి పేరు ఉంది. అత్యంత కీలకమైన అంశాలు , కుంభకోణాలకు నిలయం అయిన స్విస్ ఛాలెంజ్ తోపాటు పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలను స్పష్టంగా పైళ్ళలోనే రాశారు.

ఐ వై ఆర్ కృష్ణారావుతో పోలిస్తే అజయ్ కల్లాం విమర్శలపై చంద్రబాబు కలవరపాటుకు గురయ్యారని టీడీపీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. అందుకే ఆయన దగ్గరకు గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ఒకరిని ‘రాయబారానికి’ పంపారు. చంద్రబాబు మీ విమర్శలతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు..ఇవి ఆపండి అని అజయ్ కల్లాంని ఆ మంత్రి కోరినట్లు ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేత ఒకరు తెలిపారు. అయితే అజయ్ కల్లాం మాత్రం తాను అభివృద్ధి కేంద్రీకరణకు వ్యతిరేకం అని...స్విస్ ఛాలెంజ్ తోపాటు పలు అంశాలపై పైళ్ళలో ఏదైతే రాశానో..వాటి గురించే ప్రస్తుతం మాట్లాడుతున్నాను తప్ప...తాను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయలేదని..చేయబోనని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఈ రాయబారానికి వచ్చిన మంత్రి తప్పులన్నీ తమ వైపు పెట్టుకుని..అన్నీ చేసేసీ ఏమీ విమర్శించవద్దంటూ ఏమి అడుగుతాం అని నిట్టూర్చుకుంటూ వెళ్లిపోయినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it