కర్ణాటక రాజకీయం కొత్త మలుపు..బిజెపికి షాక్
సుప్రీంకోర్టు జోక్యంతో కర్ణాటక రాజకీయం కొత్త మలుపు తిరిగింది. సీఎం యడ్యూరప్పకు గవర్నర్ బలపరీక్షకు 15 రోజులు గడువు ఇవ్వగా...సుప్రీంకోర్టు మాత్రం శనివారం సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష తప్పనిసరిగా జరపాలని ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించకపోతే సీఎం యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం అంశాన్ని కూడా సమీక్షిస్తామని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టులో ఈ అంశంపై వాదోపవాదాలు హాట్ హాట్ గా జరిగాయి. సుప్రీం మాత్రం సభలో బలపరీక్షే సరైన విధానం అని..అది వెంటనే జరగాలని తీర్పునిచ్చింది. బలపరీక్ష ఎలా జరపాలో ప్రొటెం స్పీకర్ నిర్ణయిస్తారని సుప్రీం ప్రకటించింది. ప్రస్తుతం బిజెపి దగ్గర కేవలం 104 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉండటంతో ఈ బలపరీక్ష ఉత్కంఠగా మారనుంది. ప్రస్తుతం దేశమంతా కర్ణాటక పరిణామాల వైపే ఆసక్తిగా చూస్తోంది. బిజెపి తరపు లాయర్ బలపరీక్షకు కనీసం సోమవారం వరకూ అయినా గడువు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే సుప్రీంకోర్టు ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ జరపాలని కోరగా..ఇందుకూ ససేమిరా అని తేల్చిచెప్పింది. శుక్రవారం కాంగ్రెస్-జేడీఎస్‌ల పిటిషన్లను విచారించిన జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ భూషణ్, జస్టిస్ బాబ్డేలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ రెండు పార్టీల తరఫు న్యాయవాది తమకు 116 మంది ఎమ్మెల్యేల మద్దుతు ఉందని ధర్మాసనానికి తెలుపగా, బీజేపీ తరఫు న్యాయవాది రోహత్గి తమకూ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మై కేసును, సర్కారియా కమిషన్ సూచనలను సైతం ప్రస్తావించారు.
కాంగ్రెస్-జేడీఎస్‌ల కూటమి అపవిత్రమైనదని వాదించారు. ప్రభుత్వ ఏర్పాటును గురించి గవర్నర్‌కు ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాసిన లేఖలను ధర్మాసనం పరిశీలించింది. ఎంతమంది మద్దతు ఉందో వారి వివరాలను ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది. పూర్తిగా నంబర్ గేమ్‌పై కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉందని వ్యాఖ్యానించింది. శనివారం బలపరీక్ష నిర్వహిస్తే చేస్తే బావుంటుందని సుప్రీం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకు కాంగ్రెస్ తరఫు న్యాయవాది సింఘ్వీ సంసిద్ధత వ్యక్తం చేయగా, బీజేపీ తరఫు న్యాయవాది రోహత్గి వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. రోహత్గి అభ్యర్థనపై అంత సమయం ఇవ్వడం వల్ల ఎమ్మెల్యేల కొనుగోళ్లకు దారి తీసే అవకాశం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనివల్ల రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరగాలని తీర్పు నిచ్చింది. దీంతో కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. బిజెపి ప్రస్తుతం తాము బలపరీక్షలో నెగ్గుతామని చెబుతున్నా..ఇది ఏ మేరకు సాధ్యం అవుతుందనేది సందేహంగానే ఉంది. కాంగ్రెస్ , జెడీఎస్ లు ప్రస్తుతానికి తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. మరి శనివారం సాయంత్రం ఎలాంటి ఫలితం వెలువడుతుందో వేచిచూడాల్సిందే. ఇదిలా ఉంటే గవర్నర్ ఆగమేఘాల మీద నియమించిన ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే నియామకాన్ని కూడా నిలుపుదల చేసింది. సభల విశ్వాసపరీక్ష తర్వాతే ఇలాంటి నియామకాలు చేసుకోవాలని సూచించింది.