Telugu Gateway
Andhra Pradesh

వాటర్ లీకేజ్ ఎక్స్ పర్ట్స్ చంద్రబాబు..నారాయణ!

వాటర్ లీకేజ్ ఎక్స్ పర్ట్స్ చంద్రబాబు..నారాయణ!
X

సాధారణ వ్యక్తులు ఇల్లు కట్టుకున్నా..వర్షం కురిస్తే ఇంట్లోకి నీరు రాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ నిత్యం ప్రపంచ స్థాయి ప్రమాణాల గురించి మాట్లాడే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణల ఆధ్వర్యంలో సాగిన అమరావతి తాత్కాలిక రాజధాని నిర్మాణాల తీరు చూసిన అధికారులు మొదలుకుని..ఏపీ ప్రజలు నిత్యం నివ్వెరపోతూనే ఉన్నారు. ఇవ్వాల్సిన రేటు కంటే కోట్లాది రూపాయల అదనపు రేట్లు చెల్లించి మరీ కట్టించిన ఈ భవనాలు నిత్యం వార్తల్లో ‘నానుతూనే’ ఉన్నాయి. వాన కురిస్తే చాలు...తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం వార్తల్లో నిలవటం ఖాయం. తొలుత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లో నీరు జలపాతంలా కారింది. అప్పట్లో ఏదో పొరపాటు జరిగింది అనుకున్నారు. అధికార పార్టీ అయితే ఏకంగా జగన్ పైకెళ్లి ప్రభుత్వ పరువు తీసేందుకు పైపులు కోశారు అనేంతగా ప్రచారం చేసింది. ఇప్పుడు జగన్ పాదయాత్రలో ఉన్నారు...అసలు వైసీపీ సభ్యులు ఎవరూ అసెంబ్లీరాకపోయినా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది.

ఒక్క అసెంబ్లీలోనే కాదు...సచివాయలంలోని పలువురు మంత్రుల ఛాంబర్లలోనూ ఈ తరహా సీన్లు చాలా కన్పించాయి. గట్టిగా వర్షం కురిస్తే చాలు..వర్షం నీరు పలు భవనాల్లోకి చేరుతోంది. పోనీ ఈ భవనాలు కట్టింది ఏమైనా అల్లాటప్పా సంస్థలా అంటే అదీ కాదు. కట్టి ఏడాది కాక ముందే మళ్లీ సచివాలయం భవనాల్లో భారీ ఎత్తున మరమ్మత్తులు కూడా చేశారు. అదేమి అంటే డిఫెక్ట్ లయబులిటి రెండేళ్ళు ఉంటుంది కాబట్టి కాంట్రాక్టరే రిపేర్లు చేస్తాడు అంటారు. అసలు మంచిగా కట్టుకోవటం అవసరమా?. లేక తేడా వస్తే రిపేర్లు చేయటం ముఖ్యమా?. తాత్కాలిక సచివాలయంలోని ప్రజలకు ఇన్ని చక్కదనాలు చూపించిన చంద్రబాబు అసలు రాజధాని విషయంలో అయినా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని భవనాల లీకేజీని చూసిన తర్వాత కొంత మంది అధికారులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణలను ‘ వాటర్ లీకేజ్ ఎక్స్ పర్ట్స్’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it