Telugu Gateway

ముదురుతున్న టీటీడీ వివాదం

ముదురుతున్న టీటీడీ వివాదం
X

ఎవరి వాదన వారిదే. ఇటీవల వరకూ టీటీడీలో ఉన్న ప్రధాన అర్చకుడుగా ఉన్న రమణదీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేస్తుండగా..టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ వివరణలు ఇచ్చారు. ఓ వైపు ఆరోపణలు..మరో వైపు వివరణలతో తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తులు ఒకింత ఆందోళనకు గురయ్యే పరిస్థితి. ఆలయ నిర్వహణపై గత కొద్దికాలంగా రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌ సింఘాల్‌ స్పందించారు. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని సింఘాల్ వివరణ ఇచ్చారు. అయితే కొన్ని అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆగమశాస్త్రానికి సంబంధించిన అంశంలో అధికారుల పాత్రేమీ ఉండదన్నారు సింఘాల్. జీవో ప్రకారమే 65 ఏళ్లు నిండిన అర్చకులతో పదవీ విరమణ చేయించినట్లు ఈవో అనిల్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం అర్చుకుల పదవీ కాలం 25 ఏళ్లకు తక్కువ కాకుండా, 65 ఏళ్లకు ఎక్కువ కాకుండా అమలు చేయాలని పేర్కొన్నారు. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరు చొప్పున నలుగురికి ప్రధాన అర్చకుల పదవులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఏటా నలుగురు ప్రధాన అర్చకులు సహా మిగతా అర్చకులు స్వామివారి కైంకర్యాలు చేస్తూ వస్తున్నారని వివరించారు.

స్వామి వారి ఆభరణాలను ప్రజల ముందు ఉంచేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. స్వామివారి ఆభరణాలపై జస్టిస్‌ వాద్వా, ఎం. జగన్నాథరావు కమిటీలు వేశారని చెప్పారు. 1952 నుంచి తిరుమలలో ఉన్న ఆభరణాలు, దస్త్రాలను కమిటీ పరిశీలించిందని తెలిపారు. స్వామి వారి ఆభరణాలు అన్నింటినీ భద్రపరుస్తున్నట్లు సింఘాల్ తెలిపారు. ఇదిలా ఉంటే ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు రమణదీక్షితులు. తరతరాలుగా శ్రీవారి ఆభరణాలను అర్చకులు కాపాడుతూ వచ్చారని అన్నారు. 1996లో మిరాశి రద్దు కావడంతో ఆభరణాలను టీటీడీ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచే స్వామివారి ఆభరణాలకు రక్షణ కరువైందని ఆయన ఆరోపించారు. ఐదు పేట్ల ప్లాటినం హారంలో గులాబీ రంగు వజ్రం ఉండేదని, గరుడ సేవలో భక్తులు విసిరిన నాణేలకు వజ్రం పగిలిందని రికార్డుల్లో రాశారని, వజ్రం పగలడం జరుగుతుందా అని రమణ దీక్షితులు ప్రశ్నించారు. ఇటీవల జనీవాలో వేలం వేసిన వజ్రం ఇక్కడిదే అయి ఉండచ్చొని అనుమానం వ్యక్తం చేశారు దీక్షితులు.

ఈ మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఇరవై రెండేళ్లలో ఎన్ని మణులు, మాణిక్యాలు కనిపించకండా పోయాయని, వాటిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి తప్పిదాల కారణంగానే స్వామివారి తేజస్సు తగ్గిపోతోందని, అలా జరిగితే భక్తులకు అనుగ్రహం దొరకదని అన్నారు. వెయ్యికాళ్ల మండపం తొలగించకూడదని చాలాసార్లు చెప్పామని, శిల్ప సంపదతో కూడిన మండపాన్ని కాపాడాలని కోరినా కూడా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. రథ మండపాన్ని కూడా తీసేశారని అన్నారు. వీటన్నింటిని ప్రశ్నిస్తున్నందుకే తనని తొలగించారని పేర్కొన్నారు. శ్రీవారి అలంకారానికి పాత నగలు బదులు కొత్త నగలు ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు. తాను తప్పులు చేస్తే శిక్షించాలని.. కానీ శ్రీవారి ఆస్తులను కాపాడాలని కోరారు.

Next Story
Share it