Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ‘పంచాయతీ’ టెన్షన్!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ‘పంచాయతీ’ టెన్షన్!
X

ప్రభుత్వం చెబుతున్నట్లు తెలంగాణలో నిజంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా?. జరిగితే అంతా సాఫీగానే ముందుకు సాగుతుందా?. సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కోవటానికి ఇంకా సరిగ్గా ఏడాది కూడా సమయం లేదు. ఓ వైపు కేంద్రం తాజా పరిణామాలతో ఎన్నికలను నవంబర్ -డిసెంబర్ నెలల్లోనే పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉంది. ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే చాలా తలనొప్పులు వస్తాయని అధికార పార్టీ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. అందులో ఒకటి అభ్యర్ధులు ఎంపిక. బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా రాని వారంతా అసంతృప్తి బాట పట్టడం ఖాయం. అంతే కాదు...ఇది ఎన్నికల ముందు జరిగే ‘పంచాయతీ’ కావటంతో ఎలాగైనా గెలుపు దక్కించుకోకపోతే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు. దీని కోసం భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ ఖర్చులో చాలా వరకూ ఎమ్మెల్యేలే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అంటే సార్వత్రిక ఎన్నికల ఖర్చుకు ఇది అదనం అవుతుంది. అంత రిస్క్ అవసరమా? అన్న టెన్షన్ లో ఇఫ్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తర్జనభర్జనలు పడుతున్నారు.

ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా పలు సమస్యలు రావటం ఖాయం అనే ఆందోళన వీరిలో ఉంది. ప్రతిపక్షాలకు ఈ విషయంలో పెద్దగా పోయేది ఏమీలేదు. ఎక్కువ సీట్లు గెలిస్తే ఓకే. లేకపోతే...అధికార పార్టీ పై ఏదో ఒక నెపం చెప్పి తప్పించుకోవటానికి వారికి స్కోప్ ఉంటుంది. కానీ అధికార పార్టీ విషయంలో మాత్రం అలా కాదు. అధికార పార్టీనే ఎక్కువ సమయాల్లో స్థానిక సంస్థలను దక్కించుకునే సందర్భాలే అధికం. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల మద్దతుతో బరిలో నిలిచిన వారు పరాజయం పాలు అయితే ఆ ప్రభావం సాధారణ ఎన్నికల పై ఖచ్చితంగా ఉంటుందనే ఆందోళన కొంత మంది నేతల్లో వ్యక్తం అవుతోంది. అయితే ఏదో ఒక కారణంతో ఎన్నికలు వాయిదా పడటం ఖాయం అనే విశ్వాసంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు చెబుతోంది.

Next Story
Share it