Telugu Gateway
Andhra Pradesh

అవినీతిలో తెలంగాణ కు 2, ఏపీకి 4వ స్థానం

అవినీతిలో తెలంగాణ కు 2, ఏపీకి 4వ స్థానం
X

ప్రజలకు సేవలు అందించే విషయంలో చోటుచేసుకునే అవినీతిలో తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లు పోటీ పడుతున్నాయి. తెలంగాణ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉండగా...ఏపీ 4 స్థానంలో ఉంది. ప్రభుత్వం అందించే వివిధ సేవలు పొందేందుకు ప్రజలు అధికారులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. చాలా సేవల విషయంలో ఇదే జరుగుతోంది. సీఎంఎస్ ఇండియా తాజా సర్వే ఈ విషయాన్ని తేల్చింది. పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని దేశంలోని 13 రాష్ట్రాల్లో పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఈ జాబితా రూపొందించారు. ప్రజా సేవలు పొందే విషయంలో ప్రజలు అవినీతిని ఎదుర్కొనే వాటిలో దేశంలోనే తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ2, పంజాబ్3, ఏపీ 4, గుజరాత్ 5వ స్థానంలో ఉన్నాయి. ఓ వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులు నిజాయతీతో పనిచేస్తున్నారని చెబుతుంటే...తెలంగాణలో 73 శాతం ప్రజలు తమ సేవలు పొందేందుకు ఉద్యోగులకు డబ్బు ముట్టచెప్పాల్సి వస్తోంది. ఈ విషయాన్ని సీఎంఎస్ సర్వే తేల్చింది. ఇక ఏపీ విషయానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఏపీలో అసలు అవినీతే లేదని..ఎవరైనా ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కాల్ సెంటర్ కు ఫోన్ చేసి చెప్పాలని..వారి డబ్బు వెనక్కి ఇప్పిస్తానని ప్రకటించారు.

కానీ అక్కడ జరుగుతున్నది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అవినీతిని అరికట్టడంలో పలు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సీఎంస్ 2018 నివేదిక బహిర్గతం చేసింది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో అవినీతికి వ్యతిరేకంగా పౌర సమాజం ఒకింత చురుగ్గా ఉండగా...ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ల్లో మాత్రం అవినీతికి వ్యతిరేకంగా పోరాడే పౌర సమాజం అసలు కన్పించదని పేర్కొన్నారు. ఏపీలో అవినీతి 72 శాతం పెరిగిందని అభిప్రాయపడితే, తగ్గుముఖం పట్టిందని 14 శాతం మంది, ఎప్పటిలాగే ఉందని మరో 14 శాతం మంది చెప్పారు. ముఖ్యంగా ప్రజా సేవల విభాగంలో పరిస్థితి ఇది. అదే తెలంగాణలో అవినీతి పెరిందని 13 శాతం మంది చెప్పగా, తగ్గుముఖం పట్టిందని 34 శాతం మంది, ఎప్పటిలాగే ఉందని 53 శాతం మంది వెల్లడించారు. మొత్తం చూస్తే సీఎంఎస్ తాజా సర్వే రెండు రాష్ట్రాల్లోని పాలకులకు షాకింగ్ పరిణామమే.

Next Story
Share it