అడ్డగోలు వ్యాఖ్యలతో పవన్ కు అడ్డంగా దొరికిన టీడీపీ యువనేత!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎందుకంత కోపం పెంచుకున్నారు?. ఇటీవల వరకూ ఎవరూ ఇవ్వనిరీతిలో చంద్రబాబుకు మద్దతు ఇఛ్చి..అకస్మాత్తుగా ఎందుకు తిరగబడ్డారు?. అంతే కాదు..నాలుగేళ్ళ పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అక్రమాలు కళ్ల ముందు కనపడుతున్నా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడని జనసేనాని ఇంతలా తిరబడటానికి కారణం ఎవరు?. ఇదీ తెలుగుదేశంలో పార్టీలో జరుగుతున్న చర్చ. పవన్ ఒక్కసారే ఇంతగా మారటానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఆ పార్టీలో, ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న యువ నేత అమెరికాలో చేసిన అడ్డగోలు వ్యాఖ్యలే ‘పవన్ కళ్యాణ్’ లో ఈ మార్పునకు కారణం అయ్యాయని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆ యువనేత తన స్నేహితులతో కూర్చుని ఉన్న సమయంలో వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు అంశంపై చర్చ జరిగింది. ఆ సమయంలోనే యువనేత ..వచ్చే ఎన్నికల్లో 15 నుంచి 20 సీట్లు ఇస్తే చాలు పవన్ మన దగ్గరే పడి ఉంటాడని తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. (అవి రాయలేదు).
ఈ వ్యాఖ్యలు అక్కడ ఉన్న వ్యక్తి ఎవరో వీడియో తీసి మరీ పవన్ కళ్యాణ్ కు పంపారు. అది చూసిన పవన్ కళ్యాణ్ షాక్ కు గురయ్యారు. గత ఎన్నికల్లో ఏమీ ఆశించకుండా మద్దతు ఇస్తే తనకు దక్కిన ప్రతిఫలం ఇదా? అంటూ ఆయన తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరు గురించి ఎంతో మంది చెప్పినా పట్టించుకోని పవన్ ...ఈ వీడియో చూసిన తర్వాత మరింత క్లారిటీ తెచ్చుకుని ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే పవన్ రూటు మార్చారు. అందులో భాగంగానే ‘మద్దతు తెలిపినందుకు జీవితాంతం బానిసల్లా ఉండాలా?’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత పరుషమైన పదాలు వాడటానికి ఆ వీడియోనే కారణమని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
టీడీపీ పెద్దల తీరుపై వీడియో సాక్షిగా పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతే పవన్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ల అవినీతిపై ఎటాక్ ప్రారంభించారు. వాస్తవానికి పవన్ తొలిసారి విమర్శలు చేసినప్పుడు టీడీపీ వర్గాలు షాక్ కు గురయ్యాయి. ఇక పవన్ పోరాటయాత్రలో భాగంగా తొలి దశలో 45 రోజుల పాటు ప్రజల మధ్యే ఉండబోతున్నారు. చంద్రబాబు సర్కారు అవినీతిపై పవన్ చేసే ప్రచారం ఖచ్చితంగా టీడీపీకి నష్టం చేసే అవకాశం ఉందనే ఆందోళన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. వాస్తవానికి పవన్ తమకు మద్దతు తెలిపినంత కాలం టీడీపీ నేతలు ఎవరూ ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆయన మీద పడనీయలేదు. పవన్ కూడా అదే స్థాయిలో మద్దతు పలుకుతూ వచ్చారు. కానీ ఆ యువనేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీకి పెద్ద సమస్య తెచ్చి పెట్టాయి.