ఆ గుంటూరు జిల్లా ఎమ్మెల్యేకు రోజుకు ఐదు లక్షల ఆదాయం!
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక ఉచితం. ఇది ఏపీ ప్రభుత్వం అధికారికంగా తీసుకున్న నిర్ణయం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు బహిరంగంగా చెప్పారో లేక్కేలేదు. కానీ ఏపీలో ఎవరైనా తమకు కావాల్సిన ఇసుకను ఓ ట్రాక్టర్ తోనే...లారీతోనే తరలించుకుందామంటే కుదరదు. ఎవరైనా సాహసం చేసి వెళ్లినా ఓ తట్ట ఇసుక తీసి లారీ లేదా ట్రాక్టర్ లో వేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇసుక రీచ్ లు అన్నీ అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతిలోనే ఉన్నాయి. వారిని కాదని ఎవరూ ఇసుక రేణువును కూడా తీయలేరు. అది వాస్తవ పరిస్థితి. మరి ఉచితం ఎక్కడ?. చంద్రబాబు ప్రకటన ఎక్కడ?. అంటే అవి కేవలం ప్రకటనలు మాత్రమే. కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఈ ఇసుక దందాలో భాగస్వాములుగా ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఇసుక ద్వారా రోజుకు కనీసంగా ఐదు లక్షల రూపాయలు..గరిష్టంగా 20 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారంటే నమ్ముతారా?. రోజూ గరిష్ట మొత్తం ఉండకపోవచ్చు కానీ..ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఒక్క రోజు కూడా తగ్గదు.
ఇది మాత్రం పక్కా టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో దాదాపు ఐదారు ఇసుక రీచ్ లు ఉన్నాయి. ఆ ఎమ్మెల్యేకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. ఇసుక ద్వారా రోజూ వచ్చిపడుతున్న డబ్బును ఆయన బెంగుళూరు, హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం ప్రభుత్వ, పార్టీ పెద్దలకు స్పష్టంగా తెలుసు. పార్టీ అవసరాల కోసం ఈ ఎమ్మెల్యే నుంచి అవసరం ఉన్న ప్రతిసారి కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని సమాచారం. ఏ వ్యాపారం చేసి...ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెడితే రోజుకు ఐదు లక్షల రూపాయల ఆదాయం రావాలి. అది కేవలం ఇసుక ద్వారా చేసి చూపిస్తూ కొత్త బిజినెస్ మోడల్ ను ఆవిష్కరిస్తున్నారు ఈ ఎమ్మెల్యే. ఇదీ మచ్చుకు ఏపీలో కొనసాగుతున్న ఇసుక దందా. ఒక్క గుంటూరు జిల్లాలోనే కాదు...కృష్ణా తోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కొంత మంది ఎమ్మెల్యేలు ఇసుకాసురులుగా మారారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.