టీడీపికి షాక్ ఇచ్చేందుకు రెడీ అయిన ఎమ్మెల్యే!
తెలుగుదేశం పార్టీకి కష్టకాలం మొదలైందా?. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో చేరుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే సాగుతుంది. సీట్లు ఇఛ్చే అవకాశం లేకపోయినా సరే రాజకీయ కారణాలతో అందరినీ తీసుకొచ్చి తమ పార్టీలో ఉంచేసుకోవాలనేది టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం. ఇప్పుడు అదే దెబ్బకొడుతోంది. నమ్మించి మోసం చేశారనే ఆరోపణలతోనే యలమంచిలి రవి ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. పార్టీ నేత వసంత కృష్ణప్రసాద్ కూడా అదే దారిలో పయనించారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి వెళ్ళారు. అయితే ప్రస్తుతం ప్రకాశం జిల్లా చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీని వీడనున్నారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరేందుకు రెడీ అయినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన తరపునే బరిలో ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఈ మేరకు ఇఫ్పటికే రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ చేరిక పవన్ కళ్యాణ్ తొలి దశ టూర్ అయిపోయిన తర్వాత ఉంటుందా? లేక త్వరలోనే ఉంటుందా? అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికల సమయానికి కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జనసేన వైపు చూడటం ఖాయంగా కన్పిస్తోందని చెబుతున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పనిసరి కావటంతో గెలుపు అవకాశాలపై కొంత మంది నేతల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే ఎవరికి వారు ‘సేఫ్ గేమ్స్’ ఆడేందుకు రెడీ అయిపోతున్నారు. ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొంత మంది మంత్రులు కూడా జనసేనతో టచ్ లో ఉన్నారు. ఇప్పుడు పదవుల్లో ఉన్నందున చివరి నిమిషం వరకూ వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అధికార పార్టీ నుంచి నేతలు ఇలా పక్క పార్టీల వైపు చూడటం టీడీపీ నేతల్లో ఒకింత టెన్షన్ పెంచుతోంది.