Telugu Gateway
Telangana

టీడీపీ నుంచి మోత్కుపల్లి బహిష్కరణ

టీడీపీ నుంచి మోత్కుపల్లి బహిష్కరణ
X

టీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులపై టీడీపీ అధిష్టానం వేటు వేసింది. మహానాడు జరుగుతున్న సమయంలో తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేసిన మోత్కుపల్లి నర్సింహులపై చర్యలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రమణ కోరిక మేరకు చంద్రబాబు మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని మోత్కుపల్లి కోరినప్పటి నుంచి అధిష్టానం ఆయన్ను దూరం పెడుతుంది. ఈ తరుణంలో ఆయన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లిపై తెలంగాణ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థుల చేతిలో మోత్కుపల్లి కీలుబొమ్మగా మారారని టీ.టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత మోత్కుపల్లికి లేదన్నారు.

గవర్నర్‌ పదవి కోసం బీజేపీ నేతల దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడించలేదా అని ప్రశ్నించారు. గవర్నర్‌ పదవి..బీజేపీ ఇవ్వకపోతే చంద్రబాబు ఏం చేస్తారని అన్నారు. పవన్‌, జగన్‌ను పొగుడుతున్న మోత్కుపల్లిని ఎవరు ఆడిస్తున్నారో తెలుసని సండ్ర తెలిపారు. మహానాడు సమయంలో కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మోత్కుపల్లి రాజకీయ జీవితం ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న మోత్కుపల్లిని మహానాడుకు ఎలా పిలుస్తామని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. మోత్కుపల్లి మోసానికి క్షమార్హణ లేదని ఎల్ రమణ వ్యాఖ్యానించారు. గవర్నర్ పదవి రాదని తెలిసి గొడవలు ప్రారంభించారన్నారు. మోత్కుపల్లి విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు.

Next Story
Share it