Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు చుట్టూ భజన బృందాలు చేరాయి

చంద్రబాబు చుట్టూ భజన బృందాలు చేరాయి
X

మహానాడు వేదికగా అనంతపురం ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చుట్టూ భజన బృందాలు చేరాయని..వాస్తవాలు ఆయనకు చేరటంలేదన్నారు. చంద్రబాబు తక్షణమే టెలికాన్ఫరెన్స్ లను రద్దు చేయాలని కోరారు. ఎవరితో మాట్లాడినా సీఎంతో టెలికాన్ఫరెన్స్ లో ఉన్నామని చెబుతున్నారని..ఇలా అయితే పనులు ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలు కూడా తమ చావుకు వచ్చాయని..వాటిని వెంటనే తొలగించాలని జె సీ దివాకర్ రెడ్డి మహానాడు వేదికపై నుంచే కోరారు. జె సీ వ్యాఖ్యలకు వేదికపై ఉన్న నేతలు కూడా చప్పట్లతో స్వాగతించటం విశేషం. ఓ వైపు సీఎం చుట్టూ భజన బృందాలు చేరాయని అంటూనే ఆయన కూడా అదే పనిచేశారు. తెలుగుదేశం చంద్రబాబు ఆస్తి అంటూ...ఆయన వారసుడు లోకేష్ అని ప్రకటించారు. చంద్రబాబు తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? అని ప్రశ్నించారు.

జగన్ మాట్లాడితే చంద్రబాబు రెండు ఎకరాల నుంచి లక్షల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపిస్తారని..పెట్రోల్ బంక్ లో పనిచేసిన ధీరూబాయ్ అంబానీ లక్షల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించలేదా? ఆస్తులు సంపాదించుకుంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. అంతే కాదు చంద్రబాబు దేశానికి ప్రధాని కావాలని కోరారు. దేశానికి ఆయన సేవలు అవసరం అని పేర్కొన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలు పనిచేశారన్నారు. ప్రధానిగా మోడీ ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదన్నారు. ఈ విషయం తాను మూడేళ్ల క్రితమే చెప్పానన్నారు. అదే సమయంలో జెసీ జగన్ పై కూడా విమర్శలు గుప్పించారు. జగన్ కు తాత రాజారెడ్డి లక్షణాలే వచ్చాయని జెసీ వ్యాఖ్యానించారు. జగన్ తీరుపై వైఎస్ కూడా బాధపడేవారన్నారు. జగన్ ఎవరి మాటా వినేరకం కాదని విమర్శించారు. వైసీపీలోకి రావాలని విజయసాయిరెడ్డితో రాయబారం పంపారని..అయితే ఎంత కప్పం కడతారని అడిగారని తెలిపారు. జగన్ సంగతి తెలిసే తాను విజయసాయిరెడ్డి ప్రతిపాదనను తిరస్కరించారని చెప్పారు. చంద్రబాబుకు ఉన్నంత దూరదృష్టి ఎవరికీ లేదన్నారు.

Next Story
Share it