Telugu Gateway
Politics

‘కర్ణాటక’ను కుదిపేస్తున్న ‘వీడియో రాజకీయం’

‘కర్ణాటక’ను కుదిపేస్తున్న ‘వీడియో రాజకీయం’
X

కర్ణాటకలో ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న బిజెపికి ఇది బిగ్ బ్లో. ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో ఇప్పుడు బిజెపిని తీవ్ర ఇరాకటంలోకి నెట్టింది. అయితే బిజెపి ఇదంతా ఫేక్ అని కొట్టిపారేస్తోంది. ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇలాంటి ఫేక్ వీడియోలు నమ్మోద్దని వ్యాఖ్యానించారు. బిజెపి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం అవుతాడని భావిస్తున్న బీ శ్రీరాములుకు సంబంధించిన ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మైనింగ్ కేసు నుంచి బయటపడేందుకు గాను రూ.160 కోట్లు లంచం ఇచ్చేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అల్లుడితో మాట్లాడుతున్నట్లు ఆరోపిస్తూ బీ టీవీ చానెల్ ఒక వీడియోను ప్రసారం చేసింది. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోయినా అతని ప్రధాన అనుచరుడు శ్రీరాములుకు మాత్రం బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఈయన బదామి నుంచి ముఖ్యమంత్రి సిద్ద రామయ్యపై శ్రీరాములు పోటీ చేస్తున్నారు.

అయితే బీ టీవీ బయటపెట్టిన ఈ వీడియో ఎప్పటిది? అన్న విషయం తేలలేదు. వీడియోలో జడ్జి అల్లుడితో శ్రీరాములు మంతనాల దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏకంగా రూ.160 కోట్లు ఇచ్చేందుకు శ్రీరాములు బేరసారాలు ఆడారని ఆ వీడియో బయటపెట్టిన బీ చానెల్ చెబుతోంది. మైనింగ్ కేసు నుంచి బయట పడేందుకే శ్రీరాములు ఈ బేరసారాలు జరిపినట్లు పేర్కొంది. అయితే ఈ వీడియో 2010 నాటిదని చెబుతున్నారు. రూ. 160 కోట్లు సుప్రీం న్యాయమూర్తికి ఆఫర్ చేస్తూ... జడ్జికి సంబంధించిన బంధువులతో గాలి జనార్థన్ రెడ్డి సోదరులు మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు బయటపడింది. ఈ వీడియో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

Next Story
Share it