Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుపై పోలవరం కాంట్రాక్టర్ తిరుగుబాటు!

చంద్రబాబుపై పోలవరం కాంట్రాక్టర్ తిరుగుబాటు!
X

పోలవరం ప్రాజెక్టులో కొత్త మలుపు. ఈ ప్రాజెక్టు పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ‘తిరుగుబాటు’కు రెడీ అయిపోయింది. ఈ కారణంగానే సోమవారం నాడు జరగాల్సిన ‘పోలవరం’ సమీక్ష జరగలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టు టెండర్లు పిలవగా ‘ట్రాన్స్ స్ట్రాయ్’ ఈ పనులు దక్కించుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు అధికారంలోకి వచ్చనప్పటి నుంచి అధికారులు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు మాత్రం ‘ట్రాన్స్ స్ట్రాయ్’కు కొమ్ముకాస్తూ వచ్చారు. తర్వాత ఇలా అయితే నిండా మునుగుతామని...బ్లేమ్ మళ్లీ అదే కాంట్రాక్టర్ పై వేసి...నవయుగాను తెరపైకి తెచ్చారు. వాస్తవానికి ప్రస్తుతం నవయుగాకి ఇచ్చిన పనులకూ ఫ్రెష్ గా టెండర్లు పిలవాలని చూస్తే కేంద్రం మోకాలడ్డింది. దీంతో పాతరేట్లకే అనే ‘డ్రామా’తో నవయుగాను తెరపైకి తెచ్చారు. అందులో భాగంగానే సుమారు 1250 కోట్ల రూపాయలకు సంబంధించిన స్పిల్ వే పనులను ఆ సంస్థకు అప్పగించారు.

తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అనుమతి లేకుండా మరో 921 కోట్ల రూపాయల పనులు అప్పగించారు. దీనికి సంబంధించి కేంద్రం అనుమతి కూడా తీసుకోలేదు. ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను కూడా 60 సీ కింద నోటీసులు ఇచ్చి ట్రాన్స్ స్ట్రాయ్ నుంచి తప్పించాలని నిర్ణయించారు. 2015-16 అంచనాల ప్రకారం ఈ కాంపొనెంట్ విలువ 2729 కోట్ల రూపాయలు. ఈ పనులను ట్రాన్స్ స్ట్రాయ్ నుంచి తప్పించి నిర్మాణ రంగంలోని అగ్రశ్రేణి సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు వర్క్ ఆర్డర్ కూడా సిద్ధమైంది. ఈ సంస్థతో కమిషన్ మాట్లాడుకోవాల్సిందిగా ప్రభుత్వ పెద్దలే ట్రాన్స్ స్ట్రాయ్ ప్రతినిధులకు సూచించారు.

ఈ పనులను తామే వేరే సంస్థతో కలసి చేస్తామని...కాదు..కూడదని రద్దు చేస్తే కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో సర్కారు ప్రస్తుతానికి వెనక్కి తగ్గింది. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కంపెనీనే ట్రాన్స్ స్ట్రాయ్. అన్ని పనులను ఇతరులకు సర్కారు దగ్గరుండి అప్పగిస్తుండటంతో సంస్థ ఎండీ శ్రీధర్ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సాగునీటి శాఖ వర్గాలు తెలిపాయి. కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకుని అసలు కాంట్రాక్ట్ సంస్థను ఇంతలా వేధిస్తారా? అంటూ నిర్మాణ సంస్థ ప్రతినిధులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం తొలి దశను 2018 డిసెంబర్ కు పూర్తి చేస్తామని పలుమార్లు ప్రకటించారు. కానీ ఇది 2019 డిసెంబర్ కు రెడీ అయినా గొప్పేనని ఇంజనీర్లు చెబుతున్నారు. అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it