Telugu Gateway
Andhra Pradesh

అవినీతిని చొక్కా పట్టుకుని నిలదీస్తా

అవినీతిని చొక్కా పట్టుకుని నిలదీస్తా
X

ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన అధినేత ఎటాక్ కొనసాగుతూనే ఉంది. ‘మీ అవినీతిని ప్రశ్నించినందుకు 15 మంది జనసైనికులను జైల్లో పెట్టారు. గత ఎన్నికల్లో మీకు మద్దతు ఇస్తే చేసేది ఇదా?.మీ అవినీతిని చూస్తూ సహించం.చొక్కా పట్టుకుని నిలదీస్తాం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కాంట్రాక్టుల కోసం రాజీపడటం వల్లే ఏపీకి ప్రత్యేక హోదాకు రాకుండా పోయింది. ఆ రోజు స్పెషల్ ప్యాకేజీకి రాజీపడి ప్రజల్ని రోడ్డు మీదకు తీసుకువచ్చారు. అదేనా మీ 40 ఏళ్ళ అనుభవం. శ్రీకాకుళం జిల్లాలో వెనకబాటుతనం ప్రజలకే కానీ..రాజకీయ నాయకులు..వాళ్ళ కుటుంబాలకు మాత్రం కాదు. ఈ జిల్లాకు ఎవరున్నా లేకపోయినా..టీడీపీ, వైసీపీ లేకున్నా...నేను..జనసేన అండగా ఉంటాం’ అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

హెరిటేజ్ మాజీ ఉద్యోగికి ఫైబర్ నెట్ పేరుతో 500 కోట్ల రూపాయలు ఇస్తారు కానీ..చిన్న పాటి రిజర్వాయర్ కట్టేందుకు డబ్బు లేదంట అంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి 40 సంవత్సరాల అనుభవం ఇసుక దోపిడీకి పనికొచ్చిందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం సంపూర్ణంగా అవినీతిలో మునిగిపోయిందని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నాడు పాలకొండ, రాజాం సభల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అభివృద్ధి అంతా అమరావతిలో చేస్తూ ఉత్తరాంధ్రకు తెలుగుదేశం ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యే ఇసుక మాఫియా ద్వారా 30 కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం గురించి ఎక్కడ చూసినా రెండే రెండు మాటలు విన్పిస్తున్నాయని..అవి భూ కబ్జాలు..ఇసుక మాఫియా అని పేర్కొన్నారు.

Next Story
Share it