Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ ఖరారు

పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ ఖరారు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ కు రంగం సిద్ధం అయింది. తన పర్యటన వివరాలను పవన్ స్వయంగా గురువారం నాడు విశాఖపట్నంలో ప్రకటించారు. తొలి దశలో ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. బస్సు యాత్ర ద్వారా పవన్ పర్యటన సాగనుంది. ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా నుంచి పోరాటం ప్రారంభిస్తున్నానని, ఇందులోభాగంగా ఈ నెల 20వ తేదీన ఇచ్ఛాపురం నుంచి బస్సుయాత్ర మొదలవుతుందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. గంగాపూజ నిర్వహించి యాత్ర మొదలుపెడతామని, జై ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పిస్తామని చెప్పారు. మొత్తం 17రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తన పర్యటన ఉంటుందని చెప్పారు. బస్సుయాత్రలో భాగంగా ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ప్రతి నియోజకవర్గంలో యువత, విద్యార్థులతో కవాతు నిర్వహిస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో లక్షమందితో ఈ కవాతు ఉంటుందని పవన్‌ తెలిపారు.

ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న సమస్యలేమిటో తెలుసుకోవడానికి యాత్ర చేపడుతున్నామని తెలిపారు. కొంతమంది పాలకుల నిర్లక్ష్యానికి కోట్లాదిమంది ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రత్యక హోదాతోపాటు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని అమలుచేయలేదని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు ఇలాగే వెనుకబడి ఉంటే.. ప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరేగుతాయని తెలిపారు. జనసేన పార్టీ మ్యానిఫెస్టో కమిటీ కూడా బస్సుయాత్రలో పాల్గొంటుందని చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటన ముగిసిన తర్వాత రాయలసీమ, ఆంధ్రా ప్రాంతంలో కూడా పవన్ పర్యటన సాగనుంది.

Next Story
Share it