నన్నపనేని ‘సంచలన డిమాండ్’
తెలుగు సీరియల్స్ పై ఛాన్స్ ఉన్నప్పుడల్లా పోరాడుతున్న వ్యక్తి ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి. ఆమె తాజాగా ఓ సంచలన డిమాండ్ చేశారు. మహిళలకు ఉన్నట్లుగానే పురుషుల రక్షణ కోసం కూడా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉత్తరాంధ్రలో విజయనగరంలో భర్తను చంపించిన భార్య ఘటన, శ్రీకాకుళం జిల్లాలో భర్తపై హత్యాయత్నం వంటి ఘటనలు విస్తుగొలిపాయని వ్యాఖ్యానించారు.
మహిళల బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని ఆమె తెలిపారు. శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామన్నారు. టీవీ సీరియల్స్ ల ప్రభావం వల్లనే మహిళల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందని పేర్కొన్నారు. సీరియల్స్ మీద సెన్సార్ పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో కూడా టీవీ సీరియల్స్ పై నన్నపనేని తీవ్ర విమర్శలు చేశారు. వీటిని చూసే మహిళలు హింసాత్మక చర్యలకు తిగుతున్నారని తెలిపారు.