Telugu Gateway
Telangana

చంద్రబాబును మోడీ ఇటు నుంచి టార్గెట్ చేస్తున్నారా!

చంద్రబాబును మోడీ ఇటు నుంచి టార్గెట్ చేస్తున్నారా!
X

‘చంద్రబాబూ..నువ్వు పబ్లిక్ గా దొరికిన దొంగవు. నిన్ను ఆ బ్రహ్మదేవుడు వచ్చినా కూడా రక్షించలేడు.’ ఇదీ ఓటుకు కేసు సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి తెలంగాణ సీఎం కెసీఆర్ చేసిన వ్యాఖ్యలు. కానీ ఎవరు అడ్డం పడ్డారో తెలియదు కానీ.. ఈ కేసు అటకెక్కినట్లే అని అందరూ భావించారు. ఎందుకంటే ఇందులో ఎలాంటి పురోగతి లేదు. కానీ సడన్ గా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఓటుకు నోటు కేసు విషయంలో సోమవారం నాడు సమీక్ష నిర్వహించటం ఆసక్తికర పరిణామంగా మారింది. రాజకీయ వర్గాలు దీన్ని కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఇంత కాలం వదిలేసిన కేసును మళ్ళీ ఎందుకు బయటకు తీశారు?. దీని వెనక కారణాలు ఏమై ఉంటాయన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఓ వైపు 15వ ఆర్థిక సంఘం టీవోఆర్ పై విజయవాడలో జరిగిన సమావేశానికి తెలంగాణ నుంచి ఎవరూ హాజరుకాకపోవటం, సడన్ గా ఓటుకు నోటు కేసుపై కెసీఆర్ సమీక్ష రాజకీయ కోణంలో జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొంత కాలంగా ప్రధాని నరేంద్రమోడీపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రంలోని పెద్దల సహకారం వల్లే అప్పట్లో ఈ కేసు మూలనపడిందనే ప్రచారం సాగింది. అయితే కేంద్రంతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకుని...పాపాలు అన్నీ బిజెపివే అనే తరహాలో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు.

దీంతో కేంద్రం కూడా ఇంత కాలం వేచిచూస్తూ వచ్చింది. ఇఫ్పుడు పాత కేసును తిరగతోడి చంద్రబాబుకు చుక్కలు చూపించటానికి రంగం సిద్ధం చేసినట్లు కన్పిస్తోందనే వాదన విన్పిస్తోంది. అందులో భాగంగానే కెసీఆర్ ఈ కేసును బయటకు తీశారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బులు ఇవ్వబోతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వీడియోల సాక్షిగా దొరికిపోయారు. తర్వాత చంద్రబాబు ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. అయినా సరే కేసు ఇంత కాలం నత్తనడకన సాగింది.. ఇఫ్పుడు కొత్తగా చంద్రబాబు ఆడియోకు సంబంధించి పోరెన్సిక్ నివేదిక వచ్చిందని సమాచారం. ఈ నివేదిక కెసీఆర్ కు చేరటం వల్లే సమీక్ష చేశారని చెబుతున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు, ఇతర అధికారులు కూడా హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసులో ఏం చేయాలన్న దానిపై న్యాయనిపుణులతోనూ ప్రభుత్వం చర్చిస్తున్నట్లు సమాచారం. డీజీపీ, సీఎం కేసీఆర్‌ సమావేశానికి మాజీ ఐఏఎస్‌ అధికారి ఏకే ఖాన్‌ కూడా హాజరు అయ్యారు. కర్ణాటక ఎన్నికలు త్వరలో ముగియనుండటంతో త్వరలోనే కీలక పరిణామాలు ఉంటాయని చెబుతున్నారు.

Next Story
Share it