Telugu Gateway
Telangana

కెసీఆర్ మోడీకి భయపడుతున్నారా?

కెసీఆర్ మోడీకి భయపడుతున్నారా?
X

ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. దీని వెనక బలమైన కారణాలు కూడా ఉన్నాయి. కొద్ది నెలల క్రితం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు భారీ ఎత్తున ఆర్థిక సాయం చేశామని ప్రకటించగానే...తెలంగాణ సీఎం కెసీఆర్ నిప్పులు చెరిగారు. దేశాన్ని సాకే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని బల్లగుద్దీ మరీ వాదించారు. కేంద్రం తమకు ఇఛ్చేదానికంటే తాము కేంద్రానికి ఇచ్చేదే చాలా ఎక్కువని గట్టిగా వాదించారు. దేశానికి భారీ ఎత్తున నిధులు సమకూర్చే రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ వంటివి ఓ నాలుగైదు ఉంటాయని తెలిపారు. అలాంటిది కేంద్రం కొత్తగా ప్రకటించిన 15వ ఆర్థిక సంఘం టర్మ్స్ ఆఫ్ రిపరెన్సెస్ (టీవోఆర్) దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేవిగా ఉన్నాయని కేరళ, ఏపీతోపాటు పలు రాష్ట్రాలు గట్టిగా వాదిస్తున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు తొలుత కేరళలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి తెలంగాణతో పాటు తమిళనాడు కూడా హాజరుకాలేదు. సోమవారం నాడు విజయవాడలో పలు రాష్ట్రాల ప్రతినిధులతో ఇదే అంశంపై సమావేశం జరిగింది. దీనికి కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేదు. ఓ వైపు కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని చెప్పే కెసీఆర్ అత్యంత కీలకమైన ఈ సమావేశానికి ఆర్థిక మంత్రిని పంపకపోవటానికి కారణం ఏంటి?.

ఇదేమీ కేంద్రంపై పోరాటానికి సంబంధించిన సమావేశం ఏమీ కాదు. అందరూ కలసి కూర్చుని...ఏయే నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయో ఓ నివేదిక ఇవ్వొచ్చు. ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీలేదు. పోనీ ఇదేమీ ఏపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం కూడా ఏమీ కాదు. కానీ ఎందుకు కెసీఆర్ ఈ సమావేశాలకు తెలంగాణ ఆర్థిక శాఖ ను దూరంగా ఉంచుతున్నారు అంటే..కేవలం ప్రధాని మోడీతో ఉన్న అవగాహన వల్లే అనే విమర్శలు విన్పిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా కూడా ఇదే ఆరోపణ చేస్తోంది. నిజంగా 15వ ఆర్థిక సంఘం టీవోఆర్ ఏమీ ఇబ్బంది లేదు అనుకుంటే అదే విషయాన్ని ప్రకటించవచ్చు. కానీ అలాంటిది ఏమీ చేయటం లేదు. కానీ సమావేశాలకు హాజరు కావటం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్గాల్లోనూ ఈ అంశంపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. మోడీ కనుసన్నల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న తమిళనాడు సర్కారుతోపాటు..తెలంగాణ సర్కారు మాత్రమే ఈ భేటీకి దూరంగా ఉండటంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

Next Story
Share it