Telugu Gateway
Telangana

రైతుకు బీమా...కెసీఆర్ కు ధీమా

రైతుకు బీమా...కెసీఆర్ కు  ధీమా
X

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ గత కొన్ని రోజులుగా ‘రైతు’ టార్గెట్ గా పనిచేస్తున్నారు. తొలుత పెట్టుబడి సాయం నాలుగు వేలు అని ప్రకటించి..ఆ వెంటనే దాన్ని రెండవ పంటకు కూడా పొడిగించి ఎనిమిది వేలు చేశారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ ఐదు లక్షల మేర జీవిత బీమా కల్పించాలని నిర్ణయించారు. దేశంలోనే ఈ తరహా స్కీమ్ ఇదే మొదటి సారి. రైతులకు బీమా కల్పించటం ద్వారా రాజకీయంగా కెసీఆర్ దీమాగా ఉండొచ్చనే ఆలోచనలో ఉన్నారు. అందుకే గత కొన్ని రోజులుగా ‘రైతు బాంధవుడి’గా మారే పనిలో పడ్డారు. ఓ వైపు ప్రతిపక్ష కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల మేర రైతు రుణ మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ అంశాన్ని రాజకీయంగా పలుచన చేసేందుకే వరస పెట్టి రైతు పధకాలు ప్రకటిస్తున్నారు. అందులో భాగమే రైతు బంధు పధకం, తాజాగా బీమా సాయం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని రైతులందరికీ 5 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించి రైతులకు బీమా సర్టిఫికెట్లు అందిస్తామని వెల్లడించారు. రైతులకు ఎంత భూమి ఉన్నా, వారు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా, ఎంత వ్యయమైనా ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లిస్తుందని ప్రకటించారు.

ఈ పథకానికి కావాల్సిన నిధులను బడ్జెట్లోనే కేటాయిస్తామన్నారు. ఏటా ఆగస్టు 1న ప్రీమియం చెల్లిస్తామని చెప్పారు. విస్తృత యంత్రాంగమున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ ద్వారా బీమా పథకం అమలు చేస్తామని తెలిపారు. సాధారణ మరణమైనా, ప్రమాదవశాత్తూ చనిపోయినా రైతు ప్రతిపాదించిన నామినీకి పది రోజుల్లోగా రూ.5 లక్షల బీమా పరిహారం చెల్లించేలా ఈ పథకం ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం ప్రమాద బీమా అయితే.. ప్రభుత్వంపై వ్యయ భారం కూడా తక్కువయ్యేదని, కానీ ఎంత ఖర్చయినా మరణించిన ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకోవడాన్ని బాధ్యతగా భావించి బీమా చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

రైతుల జీవిత బీమా పథకం రూపకల్పనపై శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇంత పెద్ద మొత్తంలో బీమా చేస్తున్నందున ఎల్‌ఐసి ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం కోరారు. ‘‘తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులే 93 శాతం మంది ఉన్నారు. ఒక్క ఎకరంలోపు ఉన్న వారు 18 లక్షల మంది ఉన్నారు. వారికి భూమి తప్ప మరో జీవనాధారం లేదు. ఏదేని పరిస్థితుల్లో రైతు చనిపోతే ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఉంటే ఆ కుటుంబానికి ఆసరా ఉంటుంది. కేవలం ప్రమాద బీమా వర్తింపచేయడం వల్ల ప్రభుత్వానికి భారం తక్కువగా ఉన్నప్పటికీ, రైతులకు పెద్దగా లాభం ఉండదు.’ అని కెసీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it