Telugu Gateway
Telangana

ఫెడరల్ ఫ్రంట్...కన్ఫ్యూజన్ లో కెసీఆర్!

ఫెడరల్ ఫ్రంట్...కన్ఫ్యూజన్ లో కెసీఆర్!
X

‘ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మాకు నచ్చినట్లే చేస్తాం. మీరు చెపితే మేమేందుకు వినాలి. మేం చేసినవి తప్పు అయితే ప్రజలే తర్వాత ఎన్నికల్లో నిర్ణయం తీసుకుంటారు. రాజకీయ పార్టీ రాజకీయాలు చేయక..ఇంకేమి చేస్తది. పథకాలు పెట్టి ఓట్లు కోసం ప్రయత్నిస్తాం. ’ ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు. ప్రస్తుత సచివాలయం ప్లేస్ కొత్తది కట్టొద్దని..ప్రతిపక్షాలు అసెంబ్లీలో అభ్యంతరం చెప్పినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించి ఇఫ్పుడు ఆయన చెబుతున్న మాటలు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. తమ ప్రయత్నం ఎన్నికల కోసం కాదని...ఎవరినో ప్రధాని చేయటానికి కాదని చెబుతున్నారు. తొలుత బిజెపి, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. చెన్నయ్ పర్యటనలో కాంగ్రెస్ కు దగ్గరగా ఉంటామని..దూరంగా ఉంటామని ఏమీ చెప్పలేమన్నారు. దీనికి కారణం కాంగ్రెస్ ఉండే ఫ్రంట్ తోనే కొనసాగుతామని తర్వాత డీఎంకె స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. బుధవారం నాడు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ తో మాట్లాడిన తర్వాత మాకెవరూ అంటరానివారు కాదని కెసీఆర్ ప్రకటించటం గమనార్హం. అంటే అవసరం అయితే బిజెపి, కాంగ్రెస్ తో కూడా కలవటానికి సిద్ధమన్న మాట. అప్పుడు కెసీఆర్ ముందు చెప్పినట్లు ఈ ఫ్రంట్ బిజెపి, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది?. ఓ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చెందిన సొంత ప్రతిపక్ష పార్టీ చేసిన సూచనలను తాను పట్టించుకోవాల్సిన అవసరంలేదని చెప్పిన కెసీఆర్ తయారు చేసే ఏజెండాను మరి జాతీయ పార్టీలు అమలు చేస్తాయా?.

పలు ప్రాంతాల్లో పట్టు ఉన్న జాతీయ పార్టీలు టీఆర్ఎస్ అధినేత మాటను ఎందుకు ఖాతరు చేస్తాయి. గేమ్ అంతా ఎన్నికల తర్వాతే ఉంటుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో ప్రాంతీయ పార్టీలతో కలసి కేంద్రంలో సంకీర్ణాలు ఏర్పడటం ఎప్పటి నుంచో ఉంది. అలాంటప్పుడు కెసీఆర్ చెప్పే గుణాత్మక మార్పు ఆచరణలో ఎలా సాధ్యం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదే మొత్తం 17 సీట్లు. అందులో కెసీఆర్ పార్టీకి వచ్చేవి ఎన్నో. అలాంటప్పుడు దేశంలో గుణాత్మక మార్పులు అంటూ కెసీఆర్ ఏజెండా ఫిక్స్ చేస్తే వీటిని ఇతర ప్రాంతీయ పార్టీలు ఆమోదిస్తాయా?. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము రాజకీయాలు చేయటం కోసం కాదు..మార్పు కోసం ప్రయత్నిస్తున్నామంటే నమ్మేవారు ఎవరైనా ఉంటారా?. ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించి కెసీఆర్ చేసే వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలను కూడా కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నాయని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it