ప్రత్యేక విమానాలు...చంద్రబాబు బాటలోనే ‘కెసీఆర్’
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసీఆర్ ఒక విషయంలో సేమ్ టూ సేమ్. అదేంటి అంటారా?. ‘ప్రత్యేక విమానాల్లో’ ప్రయాణాలు. వేల కోట్ల రూపాయల లోటులో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే నిత్యం ప్రత్యేక విమానాల్లో తిరుగుతుంటే...మిగులు రాష్ట్రం తెలంగాణ మనకేం తక్కువ అనుకున్నారేమో. సీఎం కెసీఆర్ కూడా ఈ మధ్య తూచతప్పకుండా ‘ప్రత్యేక విమానాల’ ద్వారానే ప్రయాణిస్తున్నారు. పాలనలో అక్రమాలకు..అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ అని ఇతర పార్టీలు విమర్శించే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎప్పుడూ కూడా ఇలా ప్రత్యేక విమానాలను వాడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు ఎవరూ తమ పర్యటనల కోసం ప్రత్యేక విమానాలు వాడిన దాఖలాలు లేవు. రాష్ట్ర విభజన తర్వాత ఈ ట్రెండ్ భారీగా పెరిగిపోయింది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అయితే అసలు ప్రత్యేక విమానాల వాడకంలో బహుశా దేశంలోనే రికార్డు సృష్టిస్తారేమో. ఎందుకంటే ఆయన వాడకం అలా ఉంది మరి. చంద్రబాబుతో పోలిస్తే కెసీఆర్ పర్యటనలు తక్కువే అయినా ఆయన కూడా ఈ మధ్య ఖచ్చితంగా ప్రత్యేక విమానమే వాడుతున్నారు. తొలి రోజుల్లో రెగ్యులర్ ఫ్లైట్స్ లోనే వెళ్ళిన కెసీఆర్ ఇప్పుడు రూటు మార్చి ‘ప్రత్యేక విమానాల’ బాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం గొప్పగా తమది రెవెన్యూ మిగులు రాష్ట్రంగా చెప్పుకుంటున్నా...కాగ్ ఈ మధ్య అసలు విషయాన్ని బహిర్గతం చేసింది. అప్పులను కూడా ఆదాయంలో కలిపి చూపించి గోల్ మాల్ చేశారని నిగ్గుతేల్చిన విషయం తెలిసిందే.