Telugu Gateway
Andhra Pradesh

ఏపీ బిజెపి అధ్యక్షుడిగా కన్నా..వైసీపీకి ఝలక్

ఏపీ బిజెపి అధ్యక్షుడిగా కన్నా..వైసీపీకి ఝలక్
X

బిజెపి అధిష్టానం ప్రతిపక్ష వైసీపీకి ఝలక్ ఇచ్చింది. బిజెపికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు ముహుర్తం కూడా నిర్ణయించుకున్న కన్నాకు బ్రేక్ లు వేసింది ఆ పార్టీ అధిష్టానం. అంతే కాదు..ఏకంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు బిజెపి ఏపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. ఈ పరిణామాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. కన్నా లక్ష్మీనారాయణ ఈ పదవిపై చాలా ఆశలే పెట్టుకున్నారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వటం సరికాదనే వాదన తెరపైకి రావటంతో కన్నాకు పదవి వ్యవహారం వెనక్కిపోయింది. ఆ తర్వాత కన్నా బిజెపికి గుడ్ బై చెప్పటానికి రెడీ అయ్యారు. దీంతో కేంద్రంలోని బిజెపి అధిష్టానం వ్యవహారాన్ని చక్కదిద్దే పని చేపట్టింది. అందులో బాగంగా కన్నాను ఏపీ బిజెపి చీఫ్ గా నియమించారు. కర్ణాటక ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బిజెపి ఈ నిర్ణయం తీసుకుంది. కన్నాను పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఆదివారం నాడు బీజేపీ హైకమాండ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు సైతం పార్టీలో కీలక పదవి ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా వీర్రాజు నియమితులయ్యారు. తనకు కీలక పదవి దక్కడంపై కన్నా లక్ష్మీనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం పాటుపడతానని, అమిత్‌ షా, నరేంద్ర మోదీల నమ్మకాన్ని నిలబెడతానని మీడియాతో కన్నా వ్యాఖ్యానించారు. కన్నా కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి చంద్రబాబుపై ఒంటికాలిపై లేచేవారు. అయినా ఓ దశలో గంటా శ్రీనివాసరావు తదితరులు కన్నాను టీడీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆ చర్చలు ఏమీ ఫలించలేదు. కన్నా ఎటు వెళతారనే అంశంపై జోరుగా చర్చలు సాగుతున్న తరుణంలో బిజెపి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుని కన్నా విషయంలో ఊహగానాలకు తెరదించింది.

Next Story
Share it