Telugu Gateway
Andhra Pradesh

మా తప్పులు ఎత్తిచూపితే..నీ తప్పులూ చెబుతాం

మా తప్పులు ఎత్తిచూపితే..నీ తప్పులూ చెబుతాం
X

ఇదీ ఏపీలో అధికార టీడీపీ పరిస్థితి. ఏపీ ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తి చెబుతున్నట్లు టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు తప్పులు చేసి ఉంటే..ఇప్పటి వరకూ ఆయనపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని అడ్డుకుంది ఎవరు?. తప్పు చేసినట్లు అంత స్పష్టంగా చెబుతున్న మంత్రి ఇంత కాలం ఎందుకు ఉదాసీనంగా ఉన్నట్లు?. అంటే రమణదీక్షితులు ప్రభుత్వ చర్యలను తప్పుపడితే...వెంటనే సర్కారు ఎదురుదాడి చేస్తూ ఆయన తప్పులను ఎత్తిచూపుతుందన్న మాట. ప్రభుత్వాన్ని తప్పుపట్టకపోతే రమణదీక్షితులు హాయిగా ఎన్ని తప్పులు అయినా చేసుకోవచ్చన్న మాట. అంటే మా తప్పులు ఎత్తిచూపితే..నీ తప్పులపై చర్యలు ప్రారంభిస్తాం. నువ్వు ఏమీ మాట్లాడకుండా మేం చెప్పినట్లే చేస్తే మేం నిన్నేమి అనం అన్న చందంగా ఏపీ సర్కారు వైఖరి ఉంది. కోట్లాది మంది భక్తులు నమ్మే టీటీడీకి సంబంధించి ప్రధాన అర్చకుడు చేసిన విమర్శల్లో వాస్తవాలు ఉన్నాయా? లేదా అనే అంశాలను పక్కన పెట్టి.. సర్కారు ఇప్పుడు ఆయనపై ఎదురుదాడికి దిగుతోంది. మరి నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సర్కారు జెఈవోగా శ్రీనివాసరాజును సంవత్సరాల తరబడి అక్కడే ఎందుకు కొనసాగిస్తోంది. ఎందుకు ఆయనపై అంత ప్రత్యేక ప్రేమ చూపుతుంది?.

రాజకీయ కారణాలా?. ఆర్థిక కారణాలా?. ఒక్క ఈవోలను మాత్రమే రెండేళ్లకు ఒక సారి బదిలీ చేస్తూ జెఈవోను మాత్రం టచ్ చేయకపోవటం వెనక ఉన్న అంశాలేమిటి?. అవేమీ లేకపోతే ఎందుకు సర్కారు శ్రీనివాసరాజుకు అంత ‘ప్రత్యేక స్థానం’ కల్పిస్తోంది. టీటీడీలో జరుగుతున్న అవకతవకలపై రమణదీక్షితులు మాట్లాడగానే చంద్రబాబుకు..మంత్రులకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఏకంగా రమణదీక్షితులకు వైఎస్, జగన్ తోనూ లింకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏడాది పాటు టీటీడీ బోర్డు వేయకుండా చేసింది ఎవరు?. నిబంధనలకు విరుద్ధంగా ఈవోను నియమించింది ఎవరు?. అంటే చంద్రబాబు ఏదైనా నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా అన్న రీతిలో సాగుతున్నారు. రమణదీక్షితులు ప్రభుత్వంపై విమర్శలు చేశాక ఉప ముఖ్యమంత్రి కెఈ విమర్శలు చూడండి. ‘రమణ దీక్షితులు చాలా తప్పులు చేశారు. ప్రధానాలయంలోకి మనవడిని తీసుకెళ్లారు, వీఐపీలు వస్తే గెస్ట్‌ హౌస్‌ల్లోకి వెళ్లి ఆశీర్వాదం ఇచ్చేవారు. అలాగే కొంత మందిని ఆయన అర్థరాత్రి ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు చేయించారు. ఆ చర్యలను భరించలేకే రమణ దీక్షితులను విధులనుంచి తొలగించింది. ఇంతవరకూ నేను రమణ దీక్షితులు వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ​ ఇప్పుడు ఆయన తన హద్దులను దాటి మరి ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఉపేక్షించేది లేదు...ఆయన చేసిన పనులపై ప్రత్యేక విచారణ జరిపిస్తాం.’ అని వ్యాఖ్యానించారు. ఇన్ని తప్పులు ప్రభుత్వానికి తెలిసినప్పుడు ఇంత కాలం ఎందుకు మౌనంగా ఉన్నారన్నదే అసలు ప్రశ్న.

Next Story
Share it