పవన్ ‘పొలిటికల్ పిక్చర్ క్లియర్’
వచ్చే ఎన్నికల్లో జనసేన పరిమిత సీట్లకే పోటీచేస్తుందా?. చేస్తే ఎన్ని సీట్లలో చేస్తుంది. పొత్తు ఉంటుందా?. ఉంటే ఎవరితో ఉంటుంది?. ఇవీ రాజకీయ వర్గాల్లో గత కంత కాలంగా నెలకొన్న సందేహాలు. ఈ సందేహాలు అన్నింటికి తెరదించుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ పిక్చర్ కు సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. జనసేన వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లలోనూ పోటీచేస్తుందని తేల్చిచెప్పారు. తెలంగాణకు సంబంధించిన ప్రణాళికను ఆగస్టులో ప్రకటిస్తామని తెలిపారు. మంగళవారం నాడు ఏపీలోని 13 జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశం అయిన తర్వాత ఈ మేరకు జనసేన స్పష్టమైన ప్రకటన చేసింది. అదే సమయంలో పార్టీ రాజకీయ వ్యూహాకర్తగా దేవ్ ను నియమించినట్లు తెలిపారు.
పక్కాగా రూపొందించుకున్న ఎన్నికల ప్రణాళికలతో ముందుకు సాగుతామని తెలిపారు. గత రెండు ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు పనిచేశారని..ఈ అనుభవం వచ్చే ఎన్నికల్లో బరిలోకి నిలిచేందుకు సరిపోతుందని అన్నారు. అదే సమయంలో పవన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు కొద్ది మంది, కొన్ని కుటుంబాల చేతుల్లో ఉండటం వల్ల ప్రజలకు జరగాల్సిన న్యాయం జరగటంలేదన్నారు. కులాల ఐక్యత జనసేన సిద్ధాంతం అని తెలిపారు. ఒక కులానికి మరో కులం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల మధ్యకు వెళ్ళనున్నట్లు తెలిపారు.ఈ నెల11వ తేదీలోగా తన పర్యటన షెడ్యూల్ ఖరారు కానుందని తెలిపారు.