Telugu Gateway
Telangana

దూసుకెళుతున్న దేశీయ విమానయాన రంగం

దూసుకెళుతున్న దేశీయ విమానయాన రంగం
X

దేశీయ విమానయాన రంగం దూసుకెళుతోంది. ప్రతి ఏటా...ప్రతి నెలా దేశీయ రూట్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది జనవరి -ఏప్రిల్ నెలల్లోనూ ఇదే ట్రెండ్ నమోదు అయింది. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2018 జనవరి -ఏప్రిల్ కాలంలో దేశీయ రూట్లలో ప్రయాణించిన వారి సంఖ్య 4.53 కోట్లుగా ఉంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ప్రయాణికుల సంఖ్య 3.64 కోట్లు మాత్రమే. గత ఏడాది తొలి నాలుగు నెలలతో పోలిస్తే ప్రస్తుత ఏడాది ఇదే కాలంలో వృద్ధి రేటు 24.41 శాతంగా నమోదు అయింది. 2017 ఏప్రిల్ లో దేశీయ ప్రయాణికుల సంఖ్య 91.34 లక్షలు ఉండగా..2018 ఏప్రిల్ లో ఈ మొత్తం 1.15 కోట్లకు చేరింది. ఏప్రిల్ నెలలోనూ చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఆక్యుపెన్సీ రేషియో విషయంలో అగ్రస్థానంలో నిలిచింది.

ఈ సంస్థ 95 శాతం ఆక్యుపెన్సీ రేషియో దక్కించుకుని మార్కెట్ లీడర్ గా ఉంది. మరో ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో ఆక్యుపెన్సీ రేషియో 89 శాతంగా ఉంది. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ లో ఒక శాతం తగ్గుముఖం పట్టింది. 2018 ఏప్రిల్ లో ఎయిర్ ఇండియా ఆక్యుపెన్సీ రేషియో 83.6 శాతంగా ఉంటే...జెట్ ఎయిర్ వేస్ ఆక్యుపెన్సీ రేషియో 86.2 శాతం ఉంది. గతంతో పోలిస్తే హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ట్రూజెట్ సర్వీసుల రద్దు విషయంలో పరిస్థితిని చాలా వరకూ మెరుగుపర్చుకుందనే చెప్పొచ్చు. అదే సమయంలో కొత్త రూట్లలోకి ప్రవేశించి మార్కెట్ వాటా పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది.

Next Story
Share it