Telugu Gateway
Andhra Pradesh

టీటీడీని శ్రీనివాసరాజుకు రాసిచ్చిన చంద్రబాబు

టీటీడీని శ్రీనివాసరాజుకు రాసిచ్చిన చంద్రబాబు
X

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన రాజకీయ అవసరాలు..ఇతర అవసరాల కోసం వాడేసుకుంటున్నారా?. అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. తిరుమలను చంద్రబాబును టీటీడీ జెఈవో శ్రీనివాసరాజుకు రాసిచ్చేసినట్లు ఉన్నారని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ప్రభుత్వంలోనే ఏ ఉన్నతాధికారిని అయినా మూడేళ్ళు మించి ఉంచరు. కీలక స్థానాల్లో అక్కడే..అలాగే కొనసాగిస్తే అక్రమాలకు ఛాన్స్ ఉంటుందనే కారణంతో ఈ నిబంధన పెట్టుకున్నారు. కానీ టీటీడీ జెఈవోగా శ్రీనివాసరాజు 2011 ఏప్రిల్ 21న బాధ్యతలు స్వీకరించారు. అంటే చంద్రబాబు అధికారంలోకి రాకముందు నుంచే ఆయన అక్కడ ఉన్నారు. సహజంగా ఇతర ప్రభుత్వాలు వేసిన అధికారులను కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాక మార్పులు చేస్తుంటారు. కానీ శ్రీనివాసరాజు మాత్రం అలా ‘కొనసాగుతూనే’ ఉన్నారు. గతంలో చంద్రబాబు ఓ సారి శ్రీనివాసరాజును అక్కడ నుంచి బదిలీ చేయాలని తలపెట్టారు. కానీ వెంటనే న్యాయవ్యవస్థలో కీలకస్థానంలో ఉన్న వ్యక్తి జోక్యంతో అది కాస్తా ఆగిపోయింది.

మరోసారి పారిశ్రామిక ప్రముఖుడు ఒకరు అడ్డుతగిలారు. కానీ ఇప్పుడు చంద్రబాబు సర్కారు మరో రెండేళ్ళు అంటే 2020 ఏప్రిల్ 19 వరకూ శ్రీనివాసరాజును డిప్యుటేషన్ పై టీటీడీలో కొనసాగించటానికి వీలుగా ఉత్తర్వులు జారీ చేశారు.వాస్తవానికి చంద్రబాబు పదవి కాలమే 2019 జూన్ తో ముగియనుంది. కానీ శ్రీనివాసరాజుకు మాత్రం 2020 ఏప్రిల్ వరకూ చంద్రబాబు సర్కారు అనుమతి ఇఛ్చేసింది. ఇప్పటికే టీటీడీ జెఈవోగా శ్రీనివాసరాజు ఏడేళ్ళ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. మరో రెండేళ్ళు అంటే తొమ్మిదేళ్లు అవుతుంది. టీటీడీ ఈవోలు మాత్రం అలా మారుతూనే ఉన్నారు కానీ...టీటీడీ జెఈవో మాత్రం మారటం లేదు. ఈ పరిణామాలపై ప్రభుత్వ వర్గాలు నివ్వెరపోతున్నాయి. ఏపీలో పాలన చంద్రబాబు చేతిలో ఉందా? లేక పారిశ్రామికవేత్తలు...ఇతరుల చేతిలో ఉందా? అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఓ అధికారిని దాదాపు పదేళ్ళ పాటు తిరుమల వంటి అత్యంత కీలకమైన చోట కొనసాగించటం ఏ మాత్రం సరికాదని చెబుతున్నారు. మరో వైపు బిజెపితో యుద్ధం చేస్తున్నానని చెప్పుకునే చంద్రబాబు మహారాష్ట్రకు చెందిన బిజెపి మంత్రి భార్యకు టీటీడీ బోర్డు సభ్యత్వం ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story
Share it