వైసీపీతో కలసి పోటీచేయగల సమర్థుడు చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్, బిజెపి, వైసీపీతో కలసి పోటీచేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంత సమర్థత చంద్రబాబుకు ఉందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీని బెంగళూరులో చంద్రబాబు కౌగిలించుకోవటం చూడముచ్చటగా ఉందని వ్యంగాస్త్రాలు సంధించారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఎవరితో అయినా కలవగలరని అన్నారు. నిత్యం భయపడే చంద్రబాబు పాలన ఏమి సాగిస్తాడన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో భయపడే ఇంతవరకూ తెచ్చుకున్నారని విమర్శించారు.
ఇసుక మాఫియా ద్వారా సంపాదించిన డబ్బును 2019 ఎన్నికల్లో వెదజల్లేందుకు రెడీ అవుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై కూడా పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగేళ్లలో చంద్రబాబు 36 సార్లు మాటలు మార్చారని ధ్వజమెత్తారు. హామీలు నెరవేర్చకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నామని, ప్రజలు తనను మద్దతివ్వాలని కోరారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పవన్ పోరాటయాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.హెరిటేజ్ మాజీ ఉద్యోగికి ఫైబర్ నెట్ పేరుతో వందల కోట్లు ఇచ్చేశారని ఆరోపించారు. ప్రజల కష్టాలు కార్చని అధికారం, బతుకు ఎందుకు? అని ప్రశ్నించారు.