Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు ఇది ‘సవాళ్ళ సీజన్’!

చంద్రబాబుకు ఇది ‘సవాళ్ళ సీజన్’!
X

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇది సవాళ్ళ సీజన్. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించిన తరుణంలో జరుగుతున్న మహానాడులో ఆయన పార్టీ నేతలు..క్యాడర్ కు ఎలా మార్గనిర్దేశం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయపరంగా...పరిపాలనా పరంగా చంద్రబాబు ముందు చాలా సవాళ్ళే ఉన్నాయి. అత్యంత కీలకమైన అంశాలు ఏమీ ముందుకు సాగకపోవటం చంద్రబాబు అతి పెద్ద ఫెయిల్యూర్స్ గా మిగలనున్నాయి. ఏపీలో గత ఎన్నికల ముందు వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి చాలా తేడా ఉంది. అప్పటి మోడీ ఇమేజ్ ఇప్పుడు ఏపీలో అసలే లేదు. గతంలో కలిసొచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబుపై ఫైటింగ్ కు సిద్ధమయ్యారు. ఏకంగా ఏపీలోని 175 సీట్లలోనూ జనసేన బరిలో నిలుస్తుందని ప్రకటించారు. పవన్ కు అంత సీన్ ఉందా? అని ఎవరైనా అనుకోవచ్చు. అది ఎన్నికల తర్వాతే తేలుతుంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం ఇక్కడ చిక్కులు తప్పవనే విషయాన్ని స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలు అంతర్గత సంబాషణల్లో అంగీకరిస్తున్నారు.

ప్రతిపక్ష నేత జగన్ ఎలాగూ ఉండనే ఉన్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తో కలిస్తే తప్ప..ఒంటరి పోరు చేయక తప్పని పరిస్థితి. కాంగ్రెస్ తో కలిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువే జరుగుతుందనే భయం మరోవైపు. వామపక్షాలు కూడా చంద్రబాబు వైపు చూడటానికి ఏ మాత్రం ఆసక్తిగా లేవు. పైగా ఏపీకి అత్యంత కీలకమైన ‘ప్రత్యేక హోదా’ విషయంలో చంద్రబాబు మార్చిన మాటలు లెక్కలేనన్ని. బిజెపి చేసిన మోసంతో పాటు చంద్రబాబు ‘మాయ’ ను ప్రజలు అంత తేలిగ్గా విస్మరిస్తారా?.

కేంద్రం కంటే ముందు ‘ప్రత్యేక హోదాతో ఏమి వస్తుంది?. నన్ను ఎడ్యుకేట్ చేయండి. హోదా పొందిన రాష్ట్రాలు పొందిన’ లాభాలు ఏమున్నాయి? చెప్పండి అంటూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాటలను ఎవరు మర్చిపోతారు. కానీ చివరకు ప్రత్యేక హోదాను విస్మరిస్తే రాజకీయంగా నష్టం అని గ్రహించి..అప్పటి వరకూ హోదా వేస్ట్ అన్న చంద్రబాబే అన్నీ హోదాతోనే సాధ్యం అంటూ మాటమార్చి బిజెపి మోసం చేసిందని కొత్త నినాదాన్ని అందుకున్నారు. ఇప్పుడు హోదా పాపం అంతా బిజెపిపై నెట్టేసి..తాను క్లీన్ అని చెప్పుకునే పనిలో ఉన్నారు. కానీ అసెంబ్లీలో జరిగిన తీర్మానాలు..వీడియోల సాక్షిగా ఉన్న చంద్రబాబు మాటలు అంత తేలిగ్గా మాయం కావు కదా?. టీడీపీకి గత ఎన్నికల ముందు ఉన్న సానుకూల వాతావరణం ఇప్పుడు ఏ మాత్రం లేదు. మరి చంద్రబాబు వీటిని ఎలా అధిగమిస్తారన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it