Telugu Gateway

చంద్రబాబు కూడా విలువల గురించి మాట్లాడుతున్నారు

చంద్రబాబు కూడా విలువల గురించి మాట్లాడుతున్నారు
X

విచిత్రం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి విలువల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా చంద్రబాబునాయుడు విలువలను గౌరవించే వ్యక్తి అయితే గోవా, మణిపూర్ లో బిజెపి అడ్డగోలుగా వ్యవహరించినప్పుడే మాట్లాడాల్సింది. కానీ అప్పుడు కనీసం నోరు తెరవలేదు. కర్ణాటకలో బిజెపి చేస్తున్నది ఖచ్చితంగా తప్పే కావచ్చు. కానీ చంద్రబాబుకు వీటి గురించి మాట్లాడే అర్హత ఏమైనా ఉందా?. ఓ వైపు ఏపీలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను భారీ ఎత్తున కొనుగోలు చేసి...నలుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి విలువలు..రాజ్యాంగ పరిరక్షణకు కంకణబద్దుడై పనిచేసిన నాయకుడు చంద్రబాబు. ఆయన విలువల గురించి మాట్లాడితే ఆ విలువలే ఒకింత సిగ్గుపడే పరిస్థితి. బిజెపి కన్నా లక్ష్మీనారాయణకు ఏపీ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వటంపై కూడా టీడీపీ నేతలు విమర్శలు చేశారు. నిజమే. కానీ టీడీపీ చేసింది ఏమిటి?. మొదటి నుంచి టీడీపీలో ఉన్న నేతలను కాదని పీఆర్పీలో చేరి వచ్చిన కళా వెంకట్రావుకు ఏపీ అధ్యక్ష పదవి ఇవ్వలేదా?.

టీడీపీ విలువలు పాటిస్తుందా?. కనీసం మనం ఎవరినైనా ఏదైనా విమర్శించాలంటే కనీసం ఆ ఒక్క అంశంలో అయినా మన తప్పు లేకుండా చూసుకోవాలి. కానీ ఇప్పుడు చంద్రబాబుకు ఆ ఛాన్స్ లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని విలువలకు చంద్రబాబు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు కాబట్టి. అంటే బిజెపితో చంద్రబాబు కలసి ఉన్నంత కాలం వారు ఎన్ని తప్పులు చేసినా నోరెత్తరన్న మాట. ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి వచ్చినప్పటి నుంచే చంద్రబాబుకే విలువలు గుర్తుకొస్తాయన్న మాట. చంద్రబాబు ‘ప్రజాస్వామ్యం’పై చేస్తున్న వ్యాఖ్యలు చూసి నవ్వుకునే పరిస్థితి ఉంది.

Next Story
Share it