Telugu Gateway
Andhra Pradesh

కెసీఆర్ దూరం చూపారు..బాబు ‘దగ్గరయ్యారు’

కెసీఆర్ దూరం చూపారు..బాబు ‘దగ్గరయ్యారు’
X

రెండు తెలుగు రాష్ట్రాలు. రెండు భిన్న వైఖరులు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ తో వేదిక పంచుకోరాదన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యూహం. అందుకే ఆయన మంగళవారం నాడే బెంగళూరు వెళ్ళి కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామికి అభినందనలు చెప్పి వచ్చేశారు. ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే. కుమారస్వామి కాంగ్రెస్ భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందున ఎలాగూ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు హాజరవుతారు. వారితో వేదిక పంచుకోవాల్సి వస్తుంది. అందుకే కెసీఆర్ తన ప్రణాళిక తాను అమలు చేసుకున్నారు. దీనికి తోడు కెసీఆర్ ప్రస్తుతం బిజెపితో తగాదా కోరుకోవటం లేదు. అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలనే యోచనలో కెసీఆర్ ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత ఒకవేళ కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరిస్తే కెసీఆర్ ఆ పార్టీతో జట్టుకట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతానికి మాత్రం దూరం పాటిస్తున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అందుకు భిన్నమైన వైఖరి అవలంభిస్తున్నారు. ఎందుకంటే ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకంగా ఉంది. ఓ వైపు బిజెపికి దూరమైన...పవన్ కళ్యాణ్ కాలుదువ్వుతున్న తరుణంలో కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకే చంద్రబాబు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఏపీలో ఎంత లేదన్నా కాంగ్రెస్ కు ప్రస్తుతం ఓ నాలుగు శాతం ఓటు బ్యాంకు ఉంటుందని అంచనా. జనసేన దూరం అయిన కారణంగా, బిజెపితో బంధం చెడిన నేపథ్యంలో ఎంత అదనపు ఓటు బ్యాంకు కలసినా అది చంద్రబాబుకు సానుకూల అంశమే. అందుకే ఆయన కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో అయితే టీడీపీ, కాంగ్రెస్ కలిస్తే వార్ వన్ సైడ్ అవుతుందనే అభిప్రాయం బలంగా ఉంది. ఎందుకంటే ఎంత వీక్ అయినా కూడా తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకు కీలకంగా మారనుంది. అదే సమయంలో ఏపీలో నామమాత్రపు సీట్లు ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉందనే రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి కర్ణాటకలో కొలువుదీరింది కుమారస్వామి ప్రభుత్వమే అయినా...ఇందులో మెజారిటీ వాటా కాంగ్రెస్ దే అన్న సంగతి తెలిసిందే. అయితే తాను కాంగ్రెస్ కు దగ్గర కావటంతో ద్వారా చంద్రబాబు బిజెపికి హెచ్చరిక సంకేతాలు పంపటం ద్వారా తనపై జరిగే దాడిని నిలువరించాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే కర్ణాటక కేంద్రంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, బిఎస్సీ అధినేత్రి మాయావతి వంటి నేతలతో చర్చలు జరిపారు. కుమారస్వామి ప్రమాణ స్వీకార వేదికపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అప్యాయంగా పలకరించారు. ఒక వేదిక ఎన్నో సంకేతాలను పంపిందని చెప్పొచ్చు. మరి ఈ ప్రయత్నాలు ఏపీలో చంద్రబాబు ఏ మేరకు గట్టెక్కిస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it