Telugu Gateway
Andhra Pradesh

ఆంక్షలు లేని ‘అప్పుల రాజ్యం కావాలి’

ఆంక్షలు లేని ‘అప్పుల రాజ్యం కావాలి’
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అప్పులు జెట్ వేగంతో దూసుకెళుతున్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు కొత్తగా ‘ఆంక్షలు లేని అప్పుల రాజ్యం’ కోరుకుంటున్నారు. కేంద్రం ద్రవ్య జవాబుదారి బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్ బిఎం) పేరు చెప్పి రాష్ట్రాలు చేసే అప్పులపై ఆంక్షలు పెడుతుందని..ఇది రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించటమే అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా లక్ష కోట్ల రూపాయలపైనే అప్పులు తెచ్చారు.. అయితే ఆ మేరకు ప్రగతి ఎక్కడా కన్పించదు. అప్పులపై ఆంక్షలు అనేవి ఒక్క ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైన అంశం కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఇది వర్తిస్తుంది. సోమవారం నాడు అమరావతిలో జరిగిన ఆర్థిక శాఖ మంత్రుల సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

అనవసరమైన నిబంధనలు పెట్టి కేంద్రం ప్రగతిశీల రాష్ట్రాలను దెబ్బతీయటం సరికాదని వ్యాఖ్యానించారు. సహకార స్పూర్తిని కేంద్రం గౌరవించాలన్నారు. రాష్ట్రాలు జాతీయ ఏజెండాతో పనిచేస్తుంటే..కేంద్రం రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయటం సరికాదన్నారు. ఏపీ గతంలో పలు మార్లు ఎఫ్ ఆర్ బిఎం పరిమితి పెంచాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం మాత్రం ఏపీ కోరికను మన్నించలేదు. అప్పటి నుంచే ఈ అంశంపై చంద్రబాబు మోడీ సర్కారుపై గుర్రుగా ఉన్నారు. అయితే ఇఫ్పటికే చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేస్తూ అడ్డగోలు వ్యయం చేస్తున్నారని..దీనికి పరిమితులు లేకుండా చేస్తే రాబోయే రోజుల్లో ప్రజల నెత్తిన మరింత భారం పడే అవకాశం ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it