Telugu Gateway
Andhra Pradesh

బొమ్మలకూ ఆ ‘డమ్మీ’ అధ్యక్షులు అర్హులు కారా!

బొమ్మలకూ ఆ ‘డమ్మీ’ అధ్యక్షులు అర్హులు కారా!
X

మహానాడు వేదికగా తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులను అవమానించారు. టీడీపీ వార్షిక ఉత్సవ వేడుకలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఫోటోలు పెట్టలేదు. వేదిక వెనక ఏర్పాటు చేసిన సెట్టింగ్ లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ప్రస్తుత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఇవి ఉండటంపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ప్రకటించి..కనీసం వారి ఉనికిని గుర్తించటానికి కూడా చంద్రబాబు ఇష్టపడకపోవటం ఏమిటి? అనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. అంతే కాదు...ఇద్దరూ బలహీన వర్గాలకు చెందిన వారే కావటం విశేషం. చంద్రబాబు మాట్లాడితే సామాజిక న్యాయం గురించి సందేశాలు మాత్రం చాలా గొప్పగా ఇస్తారు. మరి సొంత పార్టీ అధ్యక్షులను ఇంతగా అవమానించాల్సిన అవసరం ఏముంది. ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అయినా..తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ అయినా సొంతంగా ఆయా రాష్ట్రాల్లోని ఏ ఒక్క నియోజకవర్గంలో టిక్కెట్ కేటాయించలేరు . అంతే కాదు..చంద్రబాబు, లోకేష్ ను కాదని ఒక్క విధాన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు, లోకేష్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయటం తప్ప..వీరికి సొంతంగా ఎలాంటి నిర్ణయాధికారాలు ఉండవు.

ఈ విషయం అధ్యక్షులుగా ఉన్న వారికీ తెలుసు. పార్టీలో నాయకులకూ క్లారిటీ ఉంది. కనీసం మహానాడు సమయంలో అయినా రాష్ట్ర అధ్యక్షులు ఉన్న వారి ఫోటోలు కనీసం చిన్న సైజులో అయినా మహానాడు ప్రధాన వేదికపై పెట్టి ఉండే వారికి ఒకింత గౌరవం ఇచ్చినట్లు ఉండేదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఎవరికి వారు మాట్లాడుకోవటం తప్ప..ఈ విషయాన్ని నేరుగా చంద్రబాబు ముందు పెట్టే సాహసం ఎవరూ చేయరు. ఎందుకంటే ఎవరి అవసరాలు వారివి. ఒకప్పుడు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు ప్రస్తుతం ఈ విషయాన్ని పక్కన పడేశారు. ఎందుకంటే ఆయన తన వారసుడిగా నారా లోకేష్ ను తెరమీదకు తెచ్చుకున్నారు కాబట్టి...ఈ వాదన ఇప్పుడు ఆయనకూ వర్తిస్తుంది కాబట్టి. అమరావతి లెక్కలు అడగటానికి అమిత్ షా ఎవరు?.. ప్రభుత్వంతో ఆయనకేంటి? సంబంధం అని చంద్రబాబు మహానాడు వేదిక నుంచి ప్రశ్నించారు. అందరికీ చంద్రబాబులాగా.. పార్టీ అధ్యక్షుడు...ముఖ్యమంత్రి అన్ని పదవులు అనుభవించే ఛాన్స్ ఉండదు కదా?.

Next Story
Share it