‘చంద్రబాబు’ను నమ్మని సింగపూర్ సంస్థలు!
‘నన్ను చూసి ఏపీ రాజధాని కట్టడానికి సింగపూర్ కంపెనీలు వచ్చాయి. ఇది నా క్రెడిబులిటీ. ఉచితంగానే రికార్డు టైమ్ లో రాజధాని మాస్టర్ ప్లాన్ ఇచ్చారు.’ ఇవీ చంద్రబాబు ఒకప్పటి మాటలు. మరి ఇప్పుడు సింగపూర్ కంపెనీలు చంద్రబాబును నమ్మటం లేదా?. మళ్ళీ అధికారంలోకి రావటం కష్టం అని వెనక్కిపోయాయా?. గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో జీ హుజూర్ అంటూ సింగపూర్ సంస్థల ముందు సర్కారు మోకరిల్లినా ఎందుకు ఈ సంస్థలు కనికరించటం లేదు?. సింగపూర్ సంస్థల కోసం ఏకంగా చట్టాల్లో మార్పులు చేశారు. ఆర్థిక, న్యాయ శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేశారు. అంతా నా ఇష్టం..సింగపూర్ కంపెనీల కోసం ఆ మాత్రం చేయవద్దా అంటూ చంద్రబాబు అధికారులపై హుంకరించి మరీ అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు. అయినా కూడా అవి ఎందుకు పనులు ప్రారంభించటం లేదు?. ఇదా చంద్రబాబు విశ్వసనీయత. చంద్రబాబు చెప్పినట్లు సింగపూర్ సంస్థలు ఉచితంగా ఏమీ మాస్టర్ ప్లాన్ ఏమీ ఇవ్వలేదు. దీనికి సర్కారు కోట్ల రూపాయలు చెల్లించింది. అంతే కాదు..ఇక్కడ చంద్రబాబు చేసిన మరో మహా మోసం కూడా ఉంది.
సింగపూర్ సంస్థలు రాజధాని కడతాయని ఏపీ ప్రజలను చాలా కాలం నమ్మించారు. రకరకాల బిల్డింగ్ లను చూపుతూ రాజధాని ఇలాగే ఉండబోతుంది అంటూ ప్రజలను నమ్మించారు. కానీ సీన్ కట్ చేస్తే చంద్రబాబు విశ్వసనీయతను నమ్మి వచ్చిన సింగపూర్ సంస్థలు కట్టేది ప్రైవేట్ వ్యాపార భవనాలు అని ఎప్పుడో తేలింది. చంద్రబాబు చాలా కన్వీనెంట్ గా సింగపూర్ రాజధాని అంశాన్ని మరుగున పడేశారు. ఎందుకంటే ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తే తన అసలు రంగు ప్రజలకు తెలుస్తుంది కాబట్టి. మరి తొలుత చూపించింది సింగపూర్ సంస్థలు కట్టే రాజధాని భవనాలు అయితే..మూడేళ్ళ పాటు లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్ సిద్ధం చేసిన డిజైన్లు ఏమిటి?. ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్ర ప్రజలను ఇంతలా మోసం చేస్తారా?. అసలు ఆ అవసరం ఎందుకొచ్చింది?. ఇదా చంద్రబాబు విశ్వసనీయత..నిజాయతీతో కూడిన పాలన?.