Telugu Gateway
Andhra Pradesh

‘గోద్రా’పై చంద్రబాబు చెప్పిందే నిజమైతే....!

‘గోద్రా’పై చంద్రబాబు చెప్పిందే నిజమైతే....!
X

‘గోద్రా అల్లర్లు జరిగినప్పుడు మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశా. అది మనసులో పెట్టుకునే మోడీ ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు?.’ ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తాజా మాట. ఎన్నికలకు ముందే బిజెపి మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసింది. నిజంగా చంద్రబాబునాయుడు గోద్రా అల్లర్లకు మోడీ కారణం అని నమ్మి ఉంటే..ఆయన సారధ్యంలోని పార్టీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు?. రాజకీయ లాభం తప్ప ఏమీ పట్టించుకోకూడదు అని అప్పుడు అనుకున్నారా?. పొత్తు పెట్టుకోవటానికి అడ్డం రాని ‘గోద్రా’ ఇప్పుడు గుర్తుకొచ్చిందా?. గోద్రా అల్లర్లకు కారణమైన మోడీ ఏర్పాటు చేసిన కేంద్ర కేబినెట్ లో ఇద్దరు మంత్రులను ఎలా చేర్పించారు. చంద్రబాబు చెబుతున్నదే నిజమైతే మోడీకి ఆ కారణంగా కోపం ఉంటే... అసలు టీడీపీ మంత్రులకు కేబినెట్ లో ఛాన్స్ ఇవ్వకూడదు కదా?. లోక్ సభలో బిజెపికి సరిపడా మెజారిటీ ఉంది కూడా. గోద్రా విషయంలో మోడీపై తనకు కోపం ఉందనే విషయం చంద్రబాబుకు చివరి సంవత్సరంలోనే తెలిసొచ్చిందా?. నాలుగేళ్ళు ఎప్పుడూ అలా అన్పించలేదా?. ఏడాది పాటు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని రోజు ఈ విషయం తెలియలేదా?.

అమరావతి శంకుస్థాపనకు వచ్చి మట్టి..నీళ్ళు ఇచ్చినప్పుడు తెలియలేదా?. అంటే ఖచ్చితంగా తెలుసని టీడీపీ ఎంపీలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో ప్రత్యేక హోదా విషయం ప్రజల్లో పూర్తి స్థాయిలోకి వెళ్ళిందని గ్రహించి..ఈ విషయాన్ని విస్మరిస్తే రాజకీయంగా నష్టం తప్పదని గ్రహించాకే చంద్రబాబు మంత్రివర్గం నుంచి బయటకు...ఎన్డీయే నుంచి బయటకు వంటి స్కీమ్ లు తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. అయితే ప్రత్యేక హోదాతోపాటు..విభజన హామీలు..రాజధాని నిర్మాణంలో వైఫల్యానికి కారణాలు అన్నింటిని కేంద్రంపై నెట్టేందుకే గోద్రాతోపాటు పలు అంశాలను తెరపైకి తెచ్చి చంద్రబాబు కొత్త పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు అర్థం అవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు..రైల్వే జోన్ వంటి హామీలు ఎన్నో ఇఛ్చి బిజెపి అమలు చేయని మాట ఎవరూ కాదనలేని వాస్తవం.

అయితే చంద్రబాబు ఇప్పుడు గోద్రా ఘటనను తెరపైకి తెచ్చింది ఏపీ ప్రజల్లో తనపై ఉన్న కోపాన్ని తగ్గించుకునేందుకే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నాలుగేళ్లు కలసి ఉండి ఏమీ సాధించలేని చంద్రబాబు తన వైఫల్యాన్ని పూర్తిగా బిజెపి నెట్టే పనిలో ఉన్నారు. సఖ్యతతో ఉండి రాష్ట్రానికి రావాల్సినవి అన్నీ సాధిస్తామని చెప్పింది కూడా ఇదే చంద్రబాబు. బిజెపి ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రొజక్ట్ చేసినప్పుడే నితీష్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బిజెపితో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కానీ అప్పట్లో చంద్రబాబు ‘గోద్రా’ అంశాన్ని చాలా కన్వీనెంట్ గా మర్చిపోయి...పొత్తు పెట్టుకుని..లాభపడి..ఇప్పుడు రాజకీయ నష్టం తప్పదని గ్రహించి కొత్త రాజకీయ ఎత్తుగడ వేసినట్లు స్పష్టంగా కన్పిస్తోంది.

Next Story
Share it