Telugu Gateway
Andhra Pradesh

కలెక్టర్లకు చంద్రబాబు సంజాయిషీ ఇచ్చుకున్నారా?

కలెక్టర్లకు చంద్రబాబు సంజాయిషీ ఇచ్చుకున్నారా?
X

అదేంటి?. ఓ ముఖ్యమంత్రి కలెక్టర్లకు సంజాయిషీ ఎందుకు ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నదే కదా మీ డౌట్?. నిజమే. కానీ కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించిన తీరు చూసిన వారు అవాక్కు అవటమే కాదు..ఇదెక్కడి తీరు అంటూ అశ్చర్యానికి గురవుతున్నారు. కలెక్టర్ల సమావేశం అంటే సహజంగా ప్రభుత్వ పథకాలు అమలు ఎలా జరుగుతున్నది సమీక్షించటం..కొత్తగా చేపట్టాల్సిన పనులపై మార్గనిర్దేశం చేయటం అందరికీ తెలిసిన విషయం. కానీ చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా కలెక్టర్ల సమావేశంలో ‘రాజకీయ స్పీచ్’ దంచటం మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు తాను బిజెపితో ఎందుకు పొత్తు పెట్టుకున్నది?. ఇఫ్పుడు బిజెపితో..ఎన్డీయే తో ఎందుకు తెగతెంపులు చేసుకున్నది కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించటం చూసి అధికారులు సైతం అవాక్కు అయ్యారు. ఇదంతా అధికారులకు ఎందుకు?. ఎవరి రాజకీయ నిర్ణయాలు వారు తీసుకుంటారు. తమ బాధ్యత ప్రభుత్వం చెప్పిన పని నిబంధనల ప్రకారం చేయటమే అని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు తన ప్రసంగంలో పలు రాజకీయ అంశాలు ఉండటంతో ఉన్నతాధికారులు కూడా ఇదెక్కడి చోద్యం అంటూ విస్తుపోయారు.

విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇఛ్చిన హామీలు అమలు నెరవేర్చనందుకే కేంద్రంతో విభేదించి ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్లు నిజంగా నమ్మినా కూడా వారు బయటకు వచ్చి ప్రజలకు అయితే చెప్పరు కదా?. అది వారి బాధ్యత కూడా కాదు. విభజన సందర్భంగా జరిగిన అన్యాయం కంటే ఈ నాలుగేళ్లలోనే రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదే చంద్రబాబు నాలుగేళ్ళు బిజెపి ప్రభుత్వంలో కొనసాగారు కదా? అన్న చర్చ అధికార వర్గాల్లో సాగింది. 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను పరిగణనంలోకి తీసుకుంటే దక్షిణ భారతదేశానికి పార్లమెంట్ సీట్లు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పేశారు. ఇవన్నీ కలెక్టర్లకు ఎందుకు?. చూస్తుంటే చంద్రబాబు కలెక్టర్లను కూడా టీడీపీ కోసం పోరాటం చేయమనేలా ఉన్నారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it